మూడు పదుల వయసులు రాకముందే నిత్యపెళ్లి కొడుకు అవతారమెత్తాడో యువకుడు. రోజుకో నయా పేరుతో తిరుగుతూ యువతులను మభ్యపెట్టి దాదాపు 24 మందిని మనువాడాడు. పెళ్లైన కొన్ని రోజులు ఉంటాడు. ఆ తర్వాత లెక్కా పత్తా లేకుండా మాయమైపోతాడు. ఇలా 23 మందిని బోల్తా కొట్టించిన ఈ కేడీ ఆఖరికి కటకటాలపాలయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. అసబుల్ మొల్లా అనే వ్యక్తి బంగాల్లోని సాగర్దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నేళ్ల వరకు బాగానే ఉన్నాడు. ఆ తర్వాత ఇంట్లో నుంచి నగలు తీసుకుని పారిపోయాడు. భర్త మోసం చేశాడని సాగర్దిగీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది మహిళ. దీంతో అతడి నిర్వాకం బయటపడింది.
నకిలీ గుర్తింపు కార్డులను అవలీలగా సృష్టించి బిహార్, బంగాల్లోని పలు ప్రాంతాల్లో అసబుల్ తిరిగేవాడు. ఒక చోట అనాథ అని, మరోచోట జేసీబీ డ్రైవర్ అని, ఇంకో చోట కూలీ ఇలా పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడు. అలా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని అక్కడ నుంచి పరారయ్యేవాడు. ఇలా 23 మందిని మోసం చేసి సాగర్దిగీలోని ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన చేతి వాటం చూపించి పరారయ్యాడు అసబుల్. కానీ ఈ సారి మనువాడిన అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేయడం వల్ల దొరికిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:తెరపైకి ఎన్నో పేర్లు.. చివరకు 'ఖర్గే'నే ఎందుకు..? అధిష్ఠానానికి అంత విధేయుడా..?
బంగారు నాణేల పేరుతో మోసం.. రూ.30 లక్షలు టోకరా