Rajya Sabha members oath: ఇటీవల కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులతో ఛైర్మన్ వెంకయ్యనాయుడు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. పది రాష్ట్రాలకు చెందిన 27 మంది సభ్యులు వివిధ భాషల్లో ప్రమాణం స్వీకారం చేశారు. అందులో 18 మంది భాజపాకు చెందిన వారే. హిందీలో 12 మంది ప్రమాణ స్వీకారం చేయగా.. ఇంగ్లీష్‌లో నలుగురు, సంస్కృతం, కన్నడం, మరాఠీ, ఒడియాలో ఇద్దరు చొప్పున చేశారు. పంజాబీ, తమిళం, తెలుగులో ఒక్కొక్కరు చొప్పున ప్రమాణం చేశారు.
శుక్రవారం ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ ఉన్నారు. గోయల్ మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నిక కాగా, నిర్మల కర్ణాటక నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేష్, వివేక్ కె తంఖా, ముకుల్ వాస్నిక్ కూడా ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు.
శుక్రవారం ప్రమాణస్వీకారం చేయని మిగిలిన ఎంపీలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్.. శుక్రవారం జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభలో దాదాపు 72 మంది సభ్యులు ఎగువ సభ నుంచి జులై నెలలో పదవీ విరమణ పొందనున్నారు.