26 Week Pregnancy Supreme Court : 26 వారాల పిండం గర్భవిచ్ఛిత్తికి అనుమతినివ్వాలంటూ కోరుతున్న మహిళ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పిండం ఏదైనా అసాధారణ సమస్యతో బాధపడుతోందా లేదా అనే విషయంపై నివేదిక సమర్పించాలని ఎయిమ్స్ మెడికల్ బోర్డును సుప్రీం కోర్టు ఆదేశించింది. 'ఎయిమ్స్ ఇంతకుముందు ఇచ్చిన నివేదికలో.. పిండం సాధారణంగా ఉందని వెల్లడైంది. అయినా ఈ విషయంపై సందేహాలకు ఆస్కారం లేకుండా మరో రిపోర్టు సమర్పించాలి' అని పేర్కొంది. ఈ నివేదికను సెప్టెంబర్ 16 లోపు ఇవ్వాలంటూ ఆరోజుకు వాయిదా వేసింది. అంతకుముందు, ఈ పిటిషన్ విచారణకు వచ్చిన సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్ అనుమతి కోరుతున్నారా? అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని అన్నారు.
ఇదీ కేసు?
Termination Of Pregnancy At 26 Weeks : ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత అబార్షన్ చేయించుకునేందుకు అనుమతించాలని కోరుతూ ఇటీవలే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని దేశ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు. మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని, పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. అయితే ఈ పిటిషన్‌పై మొదట విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం.. గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. ఆ ఉత్తర్వులను రికాల్ చేయాలని అభ్యర్థిస్తూ కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. ఈ పిటిషన్‌పైనే శుక్రవారం సుప్రీం విచారణ చేపట్టింది.
Woman Decision To Terminate Pregnancy :అయితే 26 వారాల గర్భ విచ్ఛిత్తి కేసులో బుధవారం (అక్టోబర్ 11) ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నమైన తీర్పునిచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో ఒకరు అబార్షన్‌కు విముఖత తెలపగా మరొకరు సమర్థించారు. ఇప్పటికే ఇద్దరు పిల్లలున్న మహిళ మానసిక కుంగుబాటుతో బాధపడుతోందని, ఆర్థికంగానూ మూడో బిడ్డను పెంచే స్థితిలో లేదని ఆమె తరఫు న్యాయవాదులు పేర్కొన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పునిచ్చింది. అయితే పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికతో ఈ తీర్పును రీకాల్ చేయాలంటూ కేంద్రం విజ్ఞప్తి చేసింది.