సీపెక్(చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్) కోసం చైనా-పాకిస్థాన్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కారిడర్ రక్షణ కోసం ఇరుదేశాలు 25వేల సైనికులను మోహరించనున్నాయి. వీరికి భారీ స్థాయిలో ఆయుధాలను కూడా సమకూర్చనున్నాయి.
పశ్చిమ చైనాలోని కష్గర్ను అరేబియా సముద్ర తీర ప్రాంతమైన గ్వాడర్ ఓడరేవుకు అనుసంధానించేదే ఈ సీపెక్ ప్రాజెక్ట్. ఇందులో భాగంగా 70బిలియన్ డాలర్ల విలువగల రైల్వే, హైవే ప్రాజెక్టులను నిర్మించనుంది చైనా. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్- భారత్ సరిహద్దు వెంబడి దీనిని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌తో హిందూ మహాసముద్రానికి చేరుకునే మార్గం చైనాకు దక్కతుంది. మరోవైపు సీపెక్‌తో తమ దేశంలో మౌలికవసతులు వృద్ధి చెందుతాయని పాకిస్థాన్ భావిస్తోంది.
ఇదీ చూడండి:-బ్రహ్మపుత్రపై చైనా డ్యాం- అలా చేస్తే భారత్‌కు లాభం!
భారీ మోహరింపు ఎందుకు?
భారత సైనిక వర్గాల సమాచారం ప్రకారం.. ఎస్ఎస్డీఎన్(స్పెషల్ సర్వీసెస్ డివిజన్ నార్త్), ఎస్‌ఎస్‌డీఎస్(స్పెషల్ సర్వీసెస్ డివిజన్ సౌత్) బలగాలను సీపెక్ వెంబడి మోహరించనున్నాయి పాక్, చైనా. ఈ రెండు డివిజన్లలో మొత్తం ఆరుగురు బ్రిగేడియర్లు, పాకిస్థాన్ కమాండర్లు, రేంజర్లు, ఫ్రాంటియర్ కార్ప్స్ పారామిలిటరీ దళాలు ఉండనున్నాయి.
ఇవన్నీ కలుపుకుని మొత్తం మీద 25వేల మంది సైనికులు సీపెక్‌కు గస్తీ కాస్తారని సంబంధిత వర్గాలు ఈటీవీ భారత్‌కు తెలిపాయి.
అయితే ఇంత భారీ స్థాయిలో బలగాల మోహరింపుపై ఆర్మీ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీపెక్ కోసం ఎస్ఎస్డీకి భారీ స్థాయిలో ఆయుధాలను ఎందుకివ్వడం? ఒక్కో డివిజన్లో బ్రిగేడియర్ ఉండటం ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. బలోచి తిరుగుబాటుదారులను కలుపుకుంటే బలగాల సంఖ్య ఇంకా పెరుగుతుందని అంటున్నారు.