తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒంటి కాలుతో సైక్లింగ్​.. 3,800 కిలోమీటర్లు.. 43 రోజులు - tanya daga

ఒక కిలోమీటరు సైక్లింగ్​ చేయమంటేనే ఆలోచించే మనం.. ఆమె కథ వింటే ఆశ్చర్యపోతాం. రెండు కాళ్లు ఉండి కూడా పెడల్​ తొక్కడానికి వెనుకడుగు వేసే వాళ్లకు.. ఆమె ఒక్క కాలుతో చేసిన ప్రయత్నం స్ఫూర్తిదాయకం. పది కాదు, వంద కాదు ఏకంగా 3,800 కిలోమీటర్లు ఒంటి కాలుతో సైక్లింగ్​ చేసిన మధ్యప్రదేశ్​కు చెందిన తానియా గాధ ఎందరికో ఆదర్శం.

tanya para cyclist
ఒంటి కాలితో.. కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు!

By

Published : Jan 21, 2021, 8:51 AM IST

Updated : Jan 21, 2021, 10:37 AM IST

ఒంటి కాలుతో సైక్లింగ్​.. 3,800 కిలోమీటర్లు.. 43 రోజులు

ఆనందంగా సాగుతున్న ఆమె జీవితాన్ని ఒక ప్రమాదం తలకిందులు చేసింది. భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలను అడియాసలు చేసింది. అయినా ఆమె భయపడలేదు. ఆ ప్రమాదంలో చావు అంచుల దాకా వెళ్లి.. ఒక కాలును కోల్పోయినా.. తన మనో స్థ్యైర్యాన్ని వీడలేదు. ఆదిత్య మెహతా ఫౌండేషన్ సాయంతో ధైర్యంగా ముందడుగు వేసిన ఆమె.. సైక్లింగ్​లో ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.

కశ్మీర్​ నుంచి కన్యాకుమారి వరకు 43 రోజుల్లో ఏకంగా 3800 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసి తనేంటో నిరూపించింది మధ్యప్రదేశ్​లోని రాజ్​గఢ్​ జిల్లా బ్యావరా పట్టణానికి చెందిన తానియా డాగా. 25 ఏళ్ల తానియా.. దేశంలోనే తొలి మహిళా పారా సైక్లిస్ట్​గా ఘనత సాధించింది. గతేడాది నంబరు 19 నుంచి డిసెంబరు 31 మధ్య చేపట్టిన సైకిల్ యాత్రతో తానియా ఈ రికార్డును సాధించింది.

ప్రమాదం ఎలా జరిగింది.

అందరి యువతుల లాగే తానియా కూడా మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలనుకుంది. అయితే తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచాడు. 2018లో ఎంబీఏ చదువుకోవడం కోసం దెహ్రాదూన్​కు వెళ్లిన తానియా కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడింది.

చికిత్స కోసం ఇందోర్​లోని ఓ ఆస్పత్రిలో చేరిన తానియాకు రెండు శస్త్రచికిత్సలు జరగ్గా.. డాక్టర్లు ఒక కాలును తొలగించారు. అయినా ఆమె బతకడం కష్టమేనని చేతులెత్తేశారు. దీంతో తానియాను మెరుగైన చికిత్స కోసం దిల్లీ తరలించారు.

దిల్లీలో తానియా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఈ క్రమంలో భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది కుంగిపోతున్న ఆమెను ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేరదీసింది. తానియాను పారా సైక్లిస్ట్​ తీర్చి దిద్దే పనిని ఆ ఫౌండేషన్​ భూజానికెత్తుకుంది.

అప్పటినుంచి తానియా ఒంటి కాలితో సైక్లింగ్​ చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. నొప్పిని లెక్కచేయని ఆమె పట్టుదలతో మొదట 100 కిలోమీటర్లు సైక్లింగ్​కు పూర్తి చేసింది.

ఆ తర్వాత సరిహద్దు భద్రతా దళం సహకారంతో మరో తొమ్మిది మంది పారా సైక్లిస్ట్​లు సహా 30మంది బృందంతో ఈ కశ్మీర్​ నుంచి కన్యాకుమారి సైకిల్​ యాత్రను పూర్తి చేసింది.

"క్రీడల్లో రాణించాలి అనుకున్న వికలాంగులకు చేయూతనందించేందుకు నిధులు సమకూర్చడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం. ఈ యాత్ర పూర్తవడానికి 43 రోజులు పట్టింది. రోజుకు సగటున 120 కిలోమీటర్లు ప్రయాణించాం. అత్యధికంగా రోజుకు 160 కిలోమీటర్లు ప్రయాణించాం."

-తానియా డాగా, పారా సైక్లిస్ట్​

బాధను తట్టుకని..

యాత్రను ప్రారంభించాక తానియాకు శారీరకంగానే కాదు మానసికంగాను అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. యాత్రను ప్రారంభించిన కొద్ది రోజులకే తండ్రి మరణించారంటూ ఆమెకు వార్త అందింది. దీంతో సొంతూరుకు తిరిగి వెళ్లిన తానియా.. మళ్లీ కొన్ని రోజులకే యాత్ర కొనసాగించింది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను మళ్లీ యాత్ర కొనసాగించానని తానియా చెప్పుకొచ్చింది. సైక్లింగ్ సవాళ్లతో కూడిన క్రీడ అని అందుకే తాను ఇది ఎంచుకున్నానని చెబుతోంది తానియా.

ఇదీ చదవండి :ఆమె వయసు 13.. రాసిన నవలలు 12

Last Updated : Jan 21, 2021, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details