ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జికా వైరస్(Zika Virus In Kanpur) చాపకింద నీరులా వ్యాపిస్తోంది. బుధవారం కొత్తగా ఆరుగురు వాయుసేన సిబ్బంది సహా 25 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో కాన్పుర్‌లో వైరస్ బాధితుల సంఖ్య 36కు చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో 14 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు.
ఆదివారం 586 మంది నమూనాలను సేకరించినట్లు కాన్పుర్ జిల్లా మేజిస్ట్రేట్(డీఎం) జి.విశాఖ్ తెలిపారు. వాటిని లఖ్‌నవూలోని కేజీఎంయూకు పరీక్షల కోసం పంపించినట్లు చెప్పారు. అందులో 25 మందికి జికా వైరస్(Zika Virus In Kanpur) నిర్ధరణ అయిందని పేర్కొన్నారు.
ఇంటింటికీ వెళ్లి పరీక్షలు
వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి జిల్లా యంత్రాంగం కృషిచేస్తోందని అధికారులు తెలిపారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్, ఫాగింగ్ చేస్తున్నట్టు పేర్కొన్నారు.