Opposition Meeting In Bengaluru : బీజేపీని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతిపక్షాలకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే 18 పార్టీలు కూటమిలో చేరగా.. తాజాగా మరో 8 పార్టీలు సైతం జతకట్టాయి. ఈ క్రమంలోనే జులై 17, 18 తేదీల్లో బెంగళూరులో జరిగే సమావేశానికి మొత్తం 24 పార్టీల ప్రతినిధులు హాజరు కానున్నారు. కర్ణాటక కాంగ్రెస్ నిర్వహించే ఈ సమావేశంలో పాల్గొని.. కూటమికి తమ మద్దతును తెలియజేస్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కూటమిలో కొత్తగా మరుమలర్చి ద్రవిడ మున్నెట్ర కళగం (MDMK) , కొంగు దేశ మక్కల్(KDMK), విడుదలై చిరుతైగల్ కచ్చి (VCK), రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలు చేరాయి. ఇందులో MDMK, KDMK పార్టీలు 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమిలో ఉన్నాయి.
ఆహ్వానాలు పంపిన ఖర్గే
మరోవైపు ఈ సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా హాజరవుతారని కూటమి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ సమావేశానికి హాజరు కావాలంటూ అన్ని పార్టీలకు అహ్వానాలు పంపారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. జూన్ 23న జరిగిన విపక్ష కూటమి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు ఖర్గే.
"బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ఆధ్వర్యంలో పట్నాలో జరిగిన విపక్ష కూటమి సమావేశం విజయవంతమైంది. ప్రజాస్వామ్యానికి హానికరమైన అనేక అంశాలపై చర్చించాం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేయాలని ఏకగ్రీవంగా ఆమోదించాం. ఈ క్రమంలోనే మరిన్ని అంశాలపైన చర్చించాల్సిన అవసరం ఉంది. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించాల్సి ఉంది. అందుకోసం కూటమిలోని పార్టీలు జులై 17న బెంగళూరులో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరుకుంటున్నాను. అనంతరం సాయంత్రం 6 గంటలకు విందు సైతం ఉంటుంది. జులై 18 ఉదయం 11 గంటలకు సమావేశం తిరిగి ప్రారంభం అవుతుంది."
--లేఖలో మల్లిఖార్జున ఖర్గే