శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న తమిళనాడులో భారీ ఎత్తున బంగారం రవాణాను గుర్తించడం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి సేలం-చెన్నై హైవే మార్గంలో అధికారులు నిర్వహించిన తనిఖీల్లో 234 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాష్ట్రమంతటా విస్తృత వాహన తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సేలం-చెన్నై జాతీయ రహదారిపై పెరియారీ ప్రాంతంలో ఎన్నికల నిఘా దళాలు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చెన్నై నుంచి సేలం వైపు వస్తున్న ఓ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేస్తుండగా.. అందులో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను గుర్తించారు. ఈ బంగారానికి సరైన పత్రాలు లేకపోవడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాన్ డ్రైవర్, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.