మధ్యప్రదేశ్ బాలాఘాట్‌కు చెందిన ఓ బుడ్డోడు తన ప్రతిభతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్‌లో చోటు సంపాదించుకున్నాడు. ఈ చిన్నారి వయసు 23 నెలలే. అయితే ఇంత చిన్న వయసున్న చిన్నారి ఏం చేసి అంత గొప్ప గుర్తింపు పొందాడు? అనే అనుమానాలు వస్తాయి. అయితే ఈ పిల్లాడికి ఉన్న జ్ఞాపకశక్తి, తెలివితేటల గురించి తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చిన్నారి కౌటిల్యగా పేరుగాంచిన ఇతడి పేరు అనునయ్ గఢ్‌పాలే. ఈ చిన్నారి ప్రత్యేకత ఏటంటే, ఒకసారి విన్న విషయాలను అస్సలు మరచిపోడు. కేవలం 23 నెలల వయసులోనే ఈ బాలునికి హిందీ, ఇంగ్లీషు భాషలపై అవగాహన ఉంది.
ఒక వ్యక్తి ఏదైనా నేర్చుకునేందుకు సంవత్సరాల సమయం పడుతుంది. అయితే ఈ బాలుడు మాత్రం ఇంత చిన్న వయసులో 40 కంటే ఎక్కువ దేశాల జెండాలను చూసి గుర్తుపట్టి ఆ దేశాల పేర్లు చెప్పగలడు. 60కి పైగా వస్తువులను చూసి వాటి పేర్లను చెప్పగలడు. ఈ బాలునికి పక్షులు, జంతువులు, పువ్వులు, కూరగాయలు చిత్రాలను చూపిస్తే.. వాటి పేర్లను ఇంగ్లీషులో చెప్పేస్తాడు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి నుంచి గొప్ప వ్యక్తుల వరకు చాలా ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలను చెప్తాడు.