రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) బృందంలోని 22 మందిని నిర్బంధించారు త్రిపుర పోలీసులు. త్రిపురలో రాజకీయ పరిస్థితులు, తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుపై అంచనా వేసేందుకు అగర్తలాలోని ఓ హోటల్లో గత వారం రోజులుగా ఈ బృందం బసచేస్తోంది. అయితే.. వీరంతా రాష్ట్రంలో అనధికారిక సర్వేలు చేస్తూ, నకిలీ గుర్తింపు కార్డులతో పలువురి వాంగ్మూలాలు నమోదు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
హోటల్లో తనిఖీలు చేస్తుండగా వారు కనిపించారని, ఆదివారం రాత్రి మొత్తం వారిని హోటల్లో నిర్బంధించినట్లు తూర్పు అగర్తలా పోలీస్ స్టేషన్ ఇఛార్జి సరోజ్ భట్టాచార్య తెలిపారు. వారిని విచారిస్తున్నట్లు చెప్పారు.
పోలీసుల తీరును తప్పుపట్టింది టీఎంసీ త్రిపుర విభాగం.
"ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. త్రిపుర నివాసిగా నేను ఆశ్చర్యానికి గురయ్యా. ఇది త్రిపుర సంస్కృతి కాదు. రాష్ట్రంలో ప్రభుత్వం పాలన సరిగా లేకపోవటం వల్ల టీఎంసీకి మద్దతు పెరిగింది. దాన్ని చూసి భాజపా భయపడుతోంది. ఆదివారం రాత్రి నుంచి ఐ-ప్యాక్ బృందాన్ని హోటల్లోనే నిర్బంధించారు. అయితే.. ఇది సాధారణ తనిఖీలో భాగంగానే చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 23 మంది ఐ-ప్యాక్ సభ్యులు గత వారం రాష్ట్రానికి వచ్చారు. పలు ప్రాంతాలను సందర్శించి క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకున్నారు. కేవలం టీఎంసీ గురించే అడగలేదు. ఇతర పార్టీల తీరు, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు."
- ఆశిష్ లాల్ సింగ్, త్రిపుర టీఎంసీ అధ్యక్షుడు.