భారత్లో తయారైన కరోనా వ్యాక్సిన్ల కోసం ఇప్పటివరకు 22 దేశాలను నుంచి అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. వీటిలో ఇప్పటికే 15 దేశాలకు టీకా అందించామన్నారు.
కరోనా కట్టడికి సహాయంగా ఫిబ్రవరి 2 నాటికి 56 లక్షల టీకా డోసులను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు కేంద్ర మంత్రి. ఒప్పందాల మేరకు 105 లక్షల టీకా డోసులను విదేశాలకు అందజేశామని తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు హర్షవర్ధన్.
మార్చిలో వృద్ధులకు టీకా
దేశంలో కరోనా టీకా పంపిణీ నిరాటంకంగా కొనసాగుతోందని హర్షవర్ధన్ తెలిపారు. "ప్రస్తుతం ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు టీకాలు అందిస్తున్నాం. మార్చి వరకు ఈ పంపిణీ పూర్తవుతుంది. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడిన వృద్ధులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెడతాం" అని కేంద్రమంత్రి తెలిపారు. టీకా పంపిణీ కోసం కేంద్ర బడ్జెట్‌లో రూ. 35 వేల కోట్లు కేటాయించామని, అవసరమైతే మరిన్ని నిధులు విడుదల చేస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో టీకా పంపిణీపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు ఈ మేరకు ఆయన సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి:ఎన్నికల వేళ తమిళనాడు సర్కార్ వరాల జల్లు