తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాల తరలింపు - 22 కరోనా మృతదేహాలు ఒకే అంబులెన్సులో తరలింపు

కరోనాతో చనిపోయిన 22 మంది శవాలను ఒకే అంబులెన్సులో తరలించారు అధికారులు. ఆస్పత్రిలో తగినన్ని అంబులెన్సులు అందుబాటులో లేనందున.. కరోనా రోగులను తరలించే వాహనంలోనే శవాలను శ్మశానాలకు చేరవేస్తున్నారు. మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

22 bodies of Covid victims stuffed into an ambulance
ఒకే అంబులెన్సులో 22 కరోనా మృతదేహాల తరలింపు

By

Published : Apr 27, 2021, 4:55 PM IST

మహారాష్ట్రలో అధికారుల నిర్లక్ష్యం, వ్యవస్థ వైఫల్యాన్ని కళ్లకు కట్టే ఘటన జరిగింది. కరోనాతో మరణించిన 22 మంది శవాలను ఒకే అంబులెన్సులో తరలించిన వైనం విమర్శలకు దారితీసింది. సరైన వైద్యపరమైన రవాణా వసతులు లేనందునే ఇలా చేయాల్సి వచ్చిందని జిల్లా అధికారులు చెబుతున్నారు.

ఒకే అంబులెన్సులో 22 శవాలు

బీడ్ జిల్లాలోని అంబజోగైలో ఉన్న స్వామి రామానంద్ తీర్థ రూరల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతులను తీసుకెళ్లిన ఈ అంబులెన్సుల్లోనే కరోనా రోగులను సైతం తరలిస్తున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

"తగినన్ని అంబులెన్సులు లేనందునే ఇలా జరిగింది. గతేడాది.. తొలి దశ కరోనా వ్యాప్తి సందర్భంగా మా వద్ద ఐదు అంబులెన్సులు ఉండేవి. అందులో మూడింటిని ఆస్పత్రి నుంచి ఉపసంహరించారు. మిగిలిన రెండు అంబులెన్సులలోనే కరోనా బాధితులను తరలిస్తున్నాం. మరో మూడు అంబులెన్సులు అందించాలని జిల్లా అధికారులకు లేఖ రాశాం."

-డా. శివాజీ సుక్రే, వైద్య కళాశాల డీన్

'బాధ్యత వారిదే!'

మరోవైపు, మృతదేహాల రవాణా.. వైద్య కళాశాల పరిధిలోని అంశమని అంబజోగై మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ ఆఫీసర్ అశోక్ సాబలే అన్నారు. శ్మశానవాటిక నిర్వహణలో తమ సిబ్బంది తలమునకలై ఉన్నారని చెప్పారు. అంబులెన్సుల కొరత ఉన్నప్పుడు.. ఎందుకు సరైన చర్యలు తీసుకోలేదని ఆస్పత్రి వర్గాలను ప్రశ్నించారు.

కొవిడ్ మృతదేహాల దహనం కోసం చితులు
చితులను పేర్చుతున్న దహనవాటిక సిబ్బంది

'అంబులెన్సులు ఇప్పిస్తాం'

కాగా, ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజ్​కిశోర్.. అదే రోజు ఒకే అంబులెన్సులో మరో 8 మృతదేహాలు తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరలో వైద్య కళాశాలకు ఓ అంబులెన్సును అందిస్తామని తెలిపారు. జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి మరో రెండు అంబులెన్సులను సిద్ధం చేయిస్తామని హామీ ఇచ్చారు.

సామూహిక దహనాలు
కరోనా శవాలకు అంత్యక్రియలు

'నిందలు తప్ప.. పని లేదు!'

అధికారులు, ఆస్పత్రి వర్గాలు ఒకరినొకరు నిందించుకోవడం తప్ప చేసిందేమీ లేదని స్థానిక భాజపా ఎమ్మెల్సీ సురేశ్ దాస్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ఇదీ చదవండి-ఆక్సిజన్​ కొరతతో ఆరుగురు రోగులు మృతి

ABOUT THE AUTHOR

...view details