Portraits with Electronic Waste: అసోంకు చెందిన రాహుల్ పరీక్ అనే కుర్రాడికి బాల్యం నుంచే లలిత కళలపై.. అమితమైన ఆసక్తి. అదే అతన్ని కొత్త మార్గాల్లో చిత్రాలు రూపొందించేలా ప్రోత్సహించింది. మూడో తరగతి నుంచే కాన్వాస్‌పై బొమ్మలు గీయడంలో మెలకువలు నేర్చుకున్న రాహుల్.. ఆ తర్వాత నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుని రాణిస్తున్నాడు. దేశవ్యాప్తంగా రోజు రోజుకూ అధికంగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో కొత్త ఆవిష్కరణలు చేయచ్చని నిరూపిస్తున్నాడు.
తల్లిదండ్రుల సూచనతో ఇంటర్మీడియెట్ వరకూ పూర్తిగా చదువుపై దృష్టి పెట్టిన రాహుల్ డిగ్రీలోకి వచ్చే సరికి మళ్లీ తన సృజనాత్మకతకు పదును పెట్టాడు. మొదట్లో భారతీయ సంగీత కళాకారులైన నేహా కక్కర్, అర్మాన్ మాలిక్, హర్షదీప్ కౌర్ చిత్రాలను వేశాడు. సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఆ చిత్రాలకు మంచి స్పందన రావడంతో కొత్త ఆలోచనలతో బొమ్మలు వేసే ప్రయత్నాల్లో విజయం సాధించాడు. అసోం మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ చిత్రాన్ని పర్యావరణానికి మేలు చేసేలా.. మొబైల్ ఫోన్, కంప్యూటర్ వ్యర్థాలతో తయారుచేసి ఆ ఫొటోను ఆయనకు ఈ మెయిల్ ద్వారా పంపాడు. మొదట్లో ఎటువంటి స్పందన రాలేదనీ.. కొన్ని ప్రయత్నాల తర్వాత తన ప్రతిభకు గుర్తింపు వచ్చిందని రాహుల్ తెలిపాడు. స్వయంగా సోనోవాల్‌కు చిత్రాన్ని అందించాననీ.. దాన్ని ఆయన ట్విట్టర్‌లో పంచుకున్నారని గుర్తు చేసుకున్నాడు.