తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో యోగి మేజిక్.. ఎస్పీ కోటలు బద్దలు.. పంజాబ్​లో ఆప్​కు షాక్ - దిల్లీ రాజిందర్ నగర్ ఉప ఎన్నిక

2022 By Polls result: ఉపఎన్నికల ఫలితాల్లో భాజపా విజయఢంకా మోగించింది. ఉత్తర్​ప్రదేశ్​లో విపక్ష సమాజ్​వాదీ పార్టీ కంచుకోటలను బద్దలు కొట్టింది. ఎస్పీ సీనియర్‌ నేత ఆజంఖాన్‌కు అడ్డా అయిన రాంపుర్ పార్లమెంట్‌ స్థానంలో పాగా వేసింది. మరో పార్లమెంటు స్థానం ఆజంగఢ్‌లోనూ విజయబావుటా ఎగురవేసింది. ఈ విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్..​ దిల్లీలోని రాజిందర్ నగర్ స్థానాన్ని గెలుచుకోగా, పంజాబ్​లో చతికిలపడింది.

2022 BYPOLLS result
2022 BYPOLLS result

By

Published : Jun 26, 2022, 5:16 PM IST

Updated : Jun 26, 2022, 6:19 PM IST

UP Rampur Bypoll 2022: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల ఫలితాల్లో భాజపా సత్తా చాటింది. జూన్ 23న జరిగిన ఉపఎన్నికల ఫలితాలు తాజాగా వెలువడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్న అధికార భాజపా... సమాజ్‌వాదీ పార్టీని గట్టి దెబ్బ కొట్టింది. ఎస్పీ సిట్టింగ్ స్థానమైన రాంపుర్ లోక్​సభ స్థానంలో భాజపా జయకేతనం ఎగురవేసింది. ఎస్పీ నేత ఆజంఖాన్ రాజీనామాతో రాంపుర్ స్థానం ఖాళీ కాగా ఉపఎన్నికలో భాజపా అభ్యర్థి ఘన్ శ్యామ్ లోధి సుమారు 42వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రామ్‌పుర్‌ పార్లమెంటు పరిధిలో మొత్తం 18.38 లక్షల మంది ఓటర్లు ఉండగా.. అందులో 60శాతం మంది ముస్లిం, మైనారిటీలే ఉన్నారు. దీంతో ఆ స్థానం ఆజంఖాన్‌కు కంచుకోటగా మారింది. అయితే ఆ కంచుకోటను బద్దలుకొట్టిన యోగి ఆదిత్యనాథ్‌ సర్కార్‌ ఆ ప్రాంతంలోనూ భాజపాను తిరుగులేని శక్తిగా నిలబెట్టింది.

ఆజంగఢ్ స్థానం కైవసం..
మరోవైపు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌ రాజీనామాతో ఖాళీ అయిన ఆజంగఢ్‌ లోక్‌సభ స్థానంలోనూ భాజపా విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ 8679 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా, రాంపుర్​లో భాజపా విజయంపై ఆజంఖాన్ అనుమానాలు వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగాన్ని భాజపా దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. ఏదైనా అంతర్జాతీయ సంస్థ ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. అప్పుడు కూడా ఎస్పీ అభ్యర్థి ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.

తాజా ఉపఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పంజాబ్‌లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. సంగ్రూర్ లోక్​సభ స్థానంలో శిరోమణి అకాలీదళ్ నేత సిమ్రన్ జీత్ మాన్ గెలుపొందారు. ఈ స్థానం నుంచి గెలుపొందిన ఆప్ నేత భగవంత్ మాన్.. పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సంగ్రూర్ లోక్​సభ స్థానానికి ఉపఎన్నికలు జరిగాయి. శిరోమణి నేత సిమ్రన్ జీత్ మాన్‌కు మెుత్తం 2,53,154 ఓట్లు రాగా, ఆప్‌ అభ్యర్థి గుర్‌మెయిల్‌ సింగ్‌కు.. 2,47,332 ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సిమ్రన్‌ జిత్‌ 5,822 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు పోలింగ్ అధికారులు తెలిపారు.

దిల్లీలో ఊరట
మరోవైపు, దిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ స్థానాన్ని ఆప్ నిలబెట్టుకుంది. రాజ్యసభ ఎంపీగా గెలుపొందిన నేపథ్యంలో ఆ స్థానానికి ఆప్ నేత రాఘవ్ చద్ధా రాజీనామా చేయగా.. ఎన్నికలు జరిగాయి. ఇందులో ఆప్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ నేత దినేశ్ పాఠక్ 55 శాతానికి పైగా ఓట్లు దక్కించుకొని విజయఢంకా మోగించారు.

త్రిపురలోనూ భాజపా హవా
దేశవ్యాప్తంగా ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగగా.. వాటిలో నాలుగు స్థానాలు త్రిపురలోనే ఉన్నాయి. తాజా ఫలితాల్లో భాజపా మూడు స్థానాల్లో గెలుపొందింది. టౌన్‌ బార్డోవాలీ స్థానం నుంచి పోటీ చేసిన త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సాహాతోపాటు జుబరాజ్‌నగర్‌, సుర్మా స్థానాల్లోనూ భాజపా అభ్యర్థులు విజయం సాధించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మాణిక్‌ సాహా.. బిప్లబ్‌ దేబ్‌ రాజీనామాతో సీఎంగా పగ్గాలు చేపట్టారు. తాజా ఎన్నికల్లో సీఎం విజయం సాధించారు. దీంతో ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. మరో కీలక స్థానమైన అగర్తలా.. భాజపా సిట్టింగ్‌ స్థానం కాగా.. తాజా ఫలితాల్లో అక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి సుదీప్‌ రాయ్‌ బర్మాన్‌ 3వేల ఓట్లతో గెలుపొందారు.

ఏపీలో వైకాపా.. ఝార్ఖండ్​లో కాంగ్రెస్..
ఝార్ఖండ్‌లోని మందార్‌ నియోజకవర్గ (జేవీఎం సిట్టింగ్‌ స్థానం) ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శిల్పి నేహా టిర్కీ గెలుపొందగా.. ఆంధ్రప్రదేశ్‌ నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డి(వైకాపా) ఘన విజయం సాధించారు.

మోదీ ట్వీట్
తాజా ఎన్నికల ఫలితాలపై స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భాజపాకు ఓటేసిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ప్రజా సంక్షేమం కోసం చేసే మంచి పనులను కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు. ఆజంగఢ్, రాంపుర్ ఎన్నికల ఫలితాలు చారిత్రకమని పేర్కొన్నారు. భాజపాకు విస్తృత మద్దతు లభిస్తోందనేందుకు ఈ ఫలితాలు ఉదహరణ అని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:

Last Updated : Jun 26, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details