2013 పట్నా గాంధీ మైదాన్‌లో వరుస బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు శిక్ష ఖరారు చేసింది. మొత్తం 9 దోషుల్లో నలుగురికి మరణశిక్ష విధించింది. ఇద్దరికి జీవితఖైదు, మరో ఇద్దరికి 10 ఏళ్లు, ఒకరికి ఏడేళ్ల జైలు శిక్ష వేసింది.
2013 అక్టోబర్ 27న.. నాటి భాజపా ప్రధాని అభ్యర్థి మోదీతో పాటు అనేక మంది కమలదళ నేతలు బిహార్‌లో ర్యాలీలు నిర్వహించాల్సి ఉంది. ఈ తరుణంలో వరుస పేలుళ్లు రాష్ట్రాన్ని కుదిపేశాయి. మోదీ ర్యాలీ నిర్వహించాల్సిన హుంకర్లోని గాంధీ మైదాన్ లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయి. అనంతరం పట్నా రైల్వే స్టేషన్లోనూ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనల్లో మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 84మంది గాయపడ్డారు.