2012 చావ్లా సామూహిక హత్యాచారం కేసులో దోషులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఈ వ్యవహారంలో నిందితులను ట్రయల్ కోర్టు, హైకోర్టు దోషులుగా తేల్చుతూ ఇచ్చిన తీర్పును పక్కన పెట్టింది. నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది సీజేఐ జస్టిస్ లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం.
దిల్లీ చావ్లా ప్రాంతంలో ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు యువకులు 19 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం చిత్రహింసలకు గురిచేశారని.. దాంతో ఆమె మృతి చెందిందనే ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన ట్రయల్ కోర్టు.. ముగ్గురు నిందితులను దోషులగా నిర్ధరించి మరణ శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును నిందితులు దిల్లీ హైకోర్టులో సవాలు చేశారు. హైకోర్టు ఆ శిక్షను ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చింది.
తమకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ముగ్గురు దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా సుప్రీం కోర్టు వారికి ఊరట కలిగించింది. ఈ కేసులో సోమవారం తుది తీర్పు ఇచ్చిన సీజేఐ జస్టిస్ యూయూ. లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ముగ్గురినీ నిర్దోషులుగా ప్రకటిస్తూ, వారికి విధించిన మరణశిక్షను రద్దు చేసింది.