మత హింస అగ్ని పర్వతం నుంచి వెలువడే లావా లాంటిదని సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు. 2002నాటి గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ సహా 64 మందికి 'సిట్' క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యం తరఫున బుధవారం ఆయన వాదనలు వినిపిస్తూ ఈ వ్యాఖ్య చేశారు. న్యాయమూర్తులు జస్టిస్ ఎ.ఎం.ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ వాదనలు వింటోంది.
"మత కల్లోలాలు వ్యవస్థీకృతమైన హింస లాంటివి. మత హింస అనే లావా నేలపై పారినప్పుడు అది మంటతో పాటు, మరకను మిగుల్చుతుంది. భవిష్యత్తులో ప్రతీకారాలు తీర్చుకోవడానికి సారవంతమైన భూమిగా మారుతుంది. ఈ హింస కారణంగానే నేను మా అమ్మమ్మ, తాతలను పాకిస్థాన్‌లో కోల్పోయాను. నేనూ బాధితుడినే. దీనిపై నేను ఎవరో ఒకరిపై ఆరోపణలు చేయడం లేదు. మత హింస ఆమోద యోగ్యం కాదు.. సహించేది లేదన్న సందేశం మాత్రం ప్రపంచానికి అందాల్సి ఉంది. చట్టబద్ధమైన పాలన ఉండాలా, ఉన్మాదుల ఇష్టారాజ్యం కావాలా అని తేల్చుకోవాల్సిన చరిత్రాత్మక సమయం ఆసన్నమయింది" అని అన్నారు. అమ్మమ్మ, తాతలను ప్రస్తావించిన సమయంలో ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇది స్పష్టంగా ఆయన ముఖంలో కనిపించింది.