Yuvagalam Padayatra @ 2000 Kms: తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం.. వైఎస్సార్సీపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి అధికార పార్టీ నాయకుల అడ్డంకులు, పోలీసులు ఆంక్షలు, వాగ్వాదాలు, అడ్డగింతలు.. అన్నింటిని దాటుకుని ముందుకు సాగుతున్న యువనేత.. నేడు మరోమైలురాయిని తన ఖాతాలో వేసుకున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి మొదటి అడుగు వేసిన లోకేశ్.. రాయలసీమ జిల్లాలను కవర్ చేసుకుని నెల్లూరు జిల్లాలో 2000 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేశారు.
నిర్దేశించుకున్న లక్ష్యంలో 50 శాతం పూర్తి చేసి.. మిగిలిన దాని కోసం వడివడిగా అడుగులు ముందుకు వేస్తున్నారు. పాదయాత్ర ద్వారా ఇప్పటికే సుమారు 30లక్షల మందిని నేరుగా కలుసుకున్న లోకేశ్.. అందరి సమస్యలను విని.. వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అలాగే పాదయాత్రలో ప్రతీ 100 కిలోమీటర్లకు ఒక్కో హామీ ఇచ్చుకుంటూ వస్తున్న యువనేత.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటిని నెెరవేరుస్తామంటూ శిలాఫలకాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా యువగళం పాదయాత్ర 2000కిలో మీటర్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ట్విట్టర్లో ట్రెండింగ్‌లో ఉంది.
Yuva Galam Padayatra Twitter Trending: ట్విట్టర్లో దేశవ్యాప్తంగా #2000kmsOfYuvaGalam అనే యాష్ టాగ్ 4వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ట్విట్టర్ వేదికగా #2000kmsOfYuvaGalam అనే యాష్ టాగ్‌తో వేల సంఖ్యలో టీడీపీ అభిమానులు, ఏపీ ప్రజలు ట్వీట్స్ చేస్తూ.. పాదయాత్రకి తమ సంఘీభావం తెలుపుతున్నారు.