దేశవ్యాప్తంగా ఆదివారం 'నీట్' పరీక్ష విజయవంతంగా జరిగింది. అయితే.. తమిళనాడులో ఇదే నీట్‌పై రాజకీయంగా పెను దుమారం రేగింది. పరీక్షకు కొన్ని గంటల ముందు చెన్నై సమీపంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి(20) ఆత్మహత్య(student commits suicide) చేసుకోవటమే అందుకు కారణం. ఇప్పటికే రెండుసార్లు నీట్ పరీక్ష రాసిన ఆ విద్యార్థి.. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎంబీబీఎస్ చేయాలన్న తన కల కలగానే మిగిలిపోతుందనే మనోవేదనతోనే ఆత్మహత్యకు(neet student died) పాల్పడినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు.
సేలం జిల్లా మెట్టూర్కు సమీపంలోని కూజయ్యూర్ గ్రామానికి చెందిన రైతు శివకుమార్ రెండో కుమారుడు ధనూష్. ఎంబీబీఎస్ చేయాలని ఇప్పటికే రెండుసార్లు నీట్ రాశాడు. ఆదివారం పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. అతను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ..ఆదివారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు సమాచారం అందించారని మెట్టూర్ రేంజ్ పోలీసు అధికారి తెలిపారు. నీట్ పరీక్ష మూడోసారి రాయబోతున్నట్లు చెప్పారు. ధనూష్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు.
విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న క్రమంలో అతని ఇంటి సమీపంలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
రాజకీయంగా దుమారం..
విద్యార్థి మృతికి అధికార డీఎంకేదే బాధ్యతగా పేర్కొంది ప్రతిపక్ష ఏఐఏడీఎంకే. అసెంబ్లీ ఎన్నికల వరకు నీట్ పరీక్ష రద్దు కోసం పోరాడామని, అయితే.. ఈ విషయంపై ప్రజలను తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో విజయం సాధించిందని డీఎంకేపై ఆరోపణలు చేశారు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి. నీట్ నుంచి తమిళనాడును మినహాయింపు ఇస్తామని డీఎంకే పెద్ద పెద్ద మాటలు చెప్పిందని.. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఏమీ చేయలేదని పేర్కొన్నారు. మరో విద్యార్థి ప్రాణాలు పోయేందుకు కారణమైందని ఆరోపించారు. రాజకీయ నాయకుల మాటలు విని మోసపోయినందుకే ధనూష్ ఆత్మహత్య చేసుకున్నాడని, విద్యార్థులు ఎవరూ ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. తమిళనాడులో నీట్ పరీక్ష ఉంటుందా? లేదా అనేది సరైన సమయంలో నిర్ణయం తీసుకుని ఉంటే.. విద్యార్థి ప్రాణాలు దక్కేవన్నారు. విద్యార్థి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పీఎంకే వ్యవస్థాపక నేత ఎస్ రామదాస్ సైతం నీట్‌ను తప్పుపట్టారు. సామాజిక న్యాయానికి నీట్ విరుద్ధంగా ఉందన్నారు. తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. దీనికి ఆత్మహత్య పరిష్కారం కాదని సూచించారు.
కేంద్రంపై డీఎంకే ఆరోపణలు..