కొబ్బరి చెట్టుకి కొబ్బరి కాయలు కాయడం సహజమే. అయితే కర్ణాటకలోని తుమకూరులో ఓ కొబ్బరి చెట్టుపై ఏకంగా 20 మొక్కలు మొలకెత్తాయి. ఈ సంఘటనను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఇదీ జరిగింది..
తుమకూరు జిల్లా మల్లదేవరహళ్లికి చెందిన రంగప్ప అనే రైతు తోటలో 30 అడుగుల కొబ్బరి చెట్టు ఉంది. అయితే ఆ కొబ్బరి చెట్టుపై 20 మొక్కలు మొలకెత్తాయి. ఈ చెట్టును రంగప్ప కుటుంబీకులు గత కొంతకాలంగా పూజిస్తున్నారు. అలాగే ఈ చెట్టును పూజిస్తే మంచి జరుగుతుందని రంగప్ప అంటున్నారు.
'చాలా ఏళ్లుగా మా తోటలో ఉన్న కొబ్బరి చెట్టుకు పూజలు చేస్తున్నాం. కొబ్బరి చెట్టు వల్ల మా కుటుంబానికి ఎంతో మేలు జరిగింది. మా గ్రామస్థులు సైతం కొబ్బరి చెట్టు వద్దకు వచ్చి పూజలు చేస్తారు. ఈ చెట్టును పూజిస్తే మంచి జరుగుతుందని వాళ్లు కూడా నమ్ముతున్నారు' అని రైతు రంగప్ప తెలిపారు.