Karnataka Election 2023 : కర్ణాటక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు ప్రధాన పార్టీలు డబ్బును భారీగా పంచిపెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సైతం రంగంలోకి దిగి.. అక్రమ నగదు రవాణాకు చెక్ పెడుతున్నారు. రెండు శాఖల అధికారులు సోదాలు చేపట్టి.. ఇప్పటి వరకు రూ. 330 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మే 4న ఆదాయపు పన్ను శాఖ సోదాలు చేపట్టి.. రూ.20 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేసింది. నగదుతో పాటు వజ్రాల ఆభరణాలు ఇందులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నగదు అంతా అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అభ్యర్థులకు చెందినదేనని అధికారులు చెప్పారు.
అధికారుల వివరాల ప్రకారం
మే 4న బెంగళూరులోని శాంతినగర్, కాక్స్ టౌన్, శివాజీనగర్, కన్నిగం రోడ్, ఆర్‌ఎంవీ కాలనీ, సదాశివనగర్, కుమార్ పార్క్, ఫెయిర్ ఫీల్డ్ లేఅవుట్ ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో రూ. 15 కోట్ల నగదు, రూ.5 కోట్ల విలువైన వజ్రాభరణాలు లభ్యమయ్యాయి. ఎన్నికల్లో పాల్గొంటున్న అభ్యర్థుల కోసం ఫైనాన్షియర్లు ఈ నగదును సమీకరించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్ట్‌లు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బులు, వస్తువులు పంచుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈసీ దీనిపై ప్రధానంగా దృష్టిపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు అధికారులు.