Kupwara Encounter: జమ్ముకశ్మీర్ కుప్వారాలో ఎన్కౌంటర్ జరిగింది. లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ముష్కరులను హతమార్చాయి భద్రతా దళాలు. ఇందులో ఓ పాకిస్థానీ ఉగ్రవాది కూడా ఉన్నట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. కుప్వారాలోని ఛక్తారాస్ కాండీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ నిర్బంధ తనిఖీలు చేపట్టారు సిబ్బంది. ఈ క్రమంలోనే పోలీసులపైకి ముష్కరులు కాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు.. పోలీసులు వెల్లడించారు. పాకిస్థాన్ ముష్కరుడిని తుఫేల్గా గుర్తించినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు. ఆపరేషన్ కొనసాగుతున్నట్లు వివరించారు. మరో వ్యక్తి ఇటీవలే ఉగ్రవాదంలోకి చేరాడని, అతడిని త్రాల్‌కు చెందిన ఇష్తియాక్ లోన్‌గా గుర్తించారు. రెండు ఏకే-56 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
సోపోర్‌లోని పానీపొరా అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లోనూ ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మట్టుబెట్టారు భద్రతా సిబ్బంది. అతడిని లాహోర్‌కు చెందిన హంజాల్లాగా గుర్తించారు. ఏకే-47 రైఫిల్, 5 మేగజైన్లను ముష్కరుడి వద్ద స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పాక్ టెర్రరిస్టులు తప్పించుకున్నారని, వారి బ్యాగుల్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయని వెల్లడించారు ఐజీపీ తెలిపారు.
డ్రోన్‌లో ఐఈడీల కలకలం:ముష్కరులు సరిహద్దుల్లో దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. డ్రోన్లద్వారా కశ్మీర్లోకి పేలుడు పదార్థాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారు. డ్రోన్ జారవిడిచిన 3 మేగ్నటిక్ ఐఈడీలను కంటోవాలా- దయారన్ ప్రాంతంలో గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు.. జమ్మూలోని భారత్- పాక్ సరిహద్దులో ఆకాశంలో కొద్దిసేపు కాల్పులు జరిపారు బీఎస్ఎఫ్ జవాన్లు. ఓ శబ్దం రావడంతో డ్రోన్ అనే అనుమానంతో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. అనంతరం చేపట్టిన సోదాల్లో టిఫిన్ బాక్సుల్లో టైమర్ సెట్ చేసి ఉంచిన ఐఈడీలను గుర్తించారు.