"రోజుకు 8 గంటల పని.. స్టేషన్‌కు ఎన్ని రైళ్లు వస్తున్నాయో.. ఎన్ని వెళ్తున్నాయో.. వాటికి బోగీలు ఎన్ని ఉన్నాయో లెక్కించాలి. టీటీఈ, క్లర్క్‌ల ఉద్యోగాల కోసం ఈ శిక్షణ తీసుకోవాలి. తర్వాత జాబ్ గ్యారెంటీ".. అంటూ రైల్వేల్లో ఉద్యోగాల పేరుతో ఓ మోసగాళ్ల గ్యాంగ్ నిరుద్యోగులకు వల వేసింది. అంతేనా.. 28 మందిని నెల రోజుల పాటు శిక్షణ పేరుతో దిల్లీ రైల్వే స్టేషన్‌లో బోగీలు లెక్కించేందుకు కూర్చోబెట్టారు. వారి నుంచి ఏకంగా రూ.2.67కోట్లు వసూలు చేశారు. తీరా మోసపోయామని తెలిసి వారంతా ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఈ కుంభకోణం తాజాగా వెలుగులోకి వచ్చింది.
దిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తమిళనాడుకు చెందిన 78 ఏళ్ల సుబ్బుసామి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. కొన్ని నెలల కిందట ఆయనకు దిల్లీలోని ఎంపీ క్వార్టర్స్‌లో కొయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయమయ్యారు. తనకు ఎంపీలు, మంత్రులు బాగా తెలుసని, రైల్వేల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. అతడి మాటలు నమ్మి సుబ్బుసామి తనకు తెలిసిన ముగ్గురు యువకులను దిల్లీకి తీసుకొచ్చారు. ఈ విషయం మదురైలోని చాలా మందికి తెలిసి మరో 25 మంది ఉద్యోగాల కోసం సుబ్బుసామిని కలిశారు. వీరిని తీసుకుని ఆయన దిల్లీ వెళ్లారు.
ఆ నిరుద్యోగులను శివరామన్.. వికాస్ రాణా అనే వ్యక్తికి పరిచయం చేశాడు. ఉత్తర రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానంటూ రాణా వారిని మోసగించాడు. రైల్వేలో టీటీఈ, ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బాధితుల నుంచి రూ.2 లక్షల నుంచి రూ.24లక్షల వరకు రాణా వసూలు చేశాడు. వైద్య పరీక్షలు, పత్రాల తనిఖీ వంటి తతంగాన్ని నిర్వహించాడు. అనంతరం ఫోర్జరీ పత్రాలతో శిక్షణ ఆర్డర్లు ఇచ్చాడు. ఐడీ కార్డులు కూడా జారీ చేశాడు.