ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం (Ayushman Bharat) కింద దిల్లీ, చెన్నై నగరాల్లో 200 పడకల సామర్థ్యంతో రెండు కంటైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి (Health minister of India) మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అన్ని వైద్య సౌకర్యాలు ఉండే ఈ కంటైనర్లను అత్యవసర సమయంలో ఎక్కడికైనా తీసుకెళ్లేలా రూపొందించనున్నట్లు వెల్లడించారు. రైళ్లు లేదా విమానాల్లో ఈ కంటైనర్లను మోసుకెళ్లొచ్చని చెప్పారు.
ఈ మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడిన మాండవీయ(Mansukh Mandaviya Health Minister) .. దేశవ్యాప్తంగా 79,415 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు గుర్తు చేశారు. మొత్తం 1.5 లక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వైద్య సంరక్షణ రంగంలో కేంద్రం అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లే విధానాన్ని పాటిస్తోందని అన్నారు. వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే అవకాశాన్ని కరోనా కల్పించిందని చెప్పారు. ఇందుకోసమే ఆయుష్మాన్ భారత్‌ను (Ayushman Bharat yojana) రూ. 64 వేల కోట్ల నిధులతో ప్రారంభించినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా జిల్లా స్థాయిలోనూ మంచి ల్యాబ్‌లు అందుబాటులో ఉండాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.
"ఆయుష్మాన్ భారత్ మిషన్ (Ayushman Bharat yojana) అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. సగటున ప్రతి జిల్లాలో రూ.90 నుంచి రూ.100 కోట్ల నిధులను మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తాం. తద్వారా రాబోయే విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం వైద్య వ్యవస్థకు చేకూరుతుంది. ఈ పథకం కింద జిల్లా స్థాయిలో 134 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నాం."
-మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి