భోపాల్ గ్యాస్ దుర్ఘటన బాధితులకు అదనపు పరిహారం ఇప్పించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. 1984లో జరిగిన ఈ ఘటనలో బాధితులకు.. అమెరికాకు చెందిన యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ నుంచి మరింత పరిహారం ఇప్పించే ప్రయత్నంలో భాగంగా కేంద్రం చేసిన అభ్యర్థనను సుప్రీం తోసిపుచ్చింది. భోపాల్ గ్యాస్ బాధితుల కోసం ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ వద్ద రూ.50 కోట్లు ఉన్నాయని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఏవైనా పెండింగ్ క్లెయిమ్లు ఉంటే ఆ నిధులతో పరిష్కరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ప్రస్తుతం యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్.. డౌ కెమికల్స్ యాజమాన్యంలో ఉంది.
యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ సంస్థను టేకోవర్ చేసిన కంపెనీ నుంచి రూ.7,844 కోట్ల పరిహారం వసూలు చేసేందుకు అనుమతించాలని సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్లో కేంద్రం కోరింది. గ్యాస్ దుర్ఘటన బాధితులకు మరింత సాయం అందించడం కోసం ఈ మేరకు పిటిషన్ వేసింది. దీనిపై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఐదు దశాబ్దాల తర్వాత ఈ సమస్యను తిరిగి లేవనెత్తడం వెనక సరైన కారణాలు కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై దాఖలైన క్యూరేటివ్ పిటిషన్ను తాము ఆమోదించలేమని స్పష్టం చేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ జేకే మహేశ్వర్లు ఉన్నారు. కేంద్రం క్యూరేటివ్ పిటిషన్పై జనవరి 12న తన తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు తాజాగా దాన్ని చదివి వినిపించింది.