180 Grams Drone : కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన టెక్ సమ్మిట్‌లో జేబులో పెట్టుకోగలిగే అత్యంత తేలికైన డ్రోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆర్ట్పార్క్, Vaydyn సంయుక్తంగా ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేశాయి. ఈ డ్రోన్ సహాయంతో అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచవచ్చని Vaydyn ప్రతినిధి తెలిపారు. ఆర్మీతోపాటు పోలీసులు కూడా ఈ డ్రోన్‌ను ఉపయోగించవచ్చని చెప్పారు.
"ఈ నానో డ్రోన్‌ను ఎనిమిది నెలల క్రితం రూపొందించాం .ఇది టర్బైన్ పైపుల్లో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే సులభంగా తొలగించగలదు. దీని బరువు కేవలం 180 గ్రాములు మాత్రమే. డ్రోన్‌ను ఒకసారి ఫుల్‌ఛార్జ్ చేస్తే 25 నిమిషాల పాటు పనిచేస్తుంది. సెకనుకు గరిష్ఠంగా 25 మీటర్ల ఎత్తు ఎగురగలదు. ఈ నానో డ్రోన్ ధర లక్ష రూపాయలు"
-Vaydyn కంపెనీ ప్రతినిధి
ఈ తేలికపాటి డ్రోన్‌తో పాటు మరో బుల్లి విమానాన్ని కూడా తయారు చేసింది ఐఐఎస్సీ. అత్యవసర పరిస్థితుల్లో దీనిని ఉపయోగించి నిత్యావసర వస్తువులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించవచ్చు. ఈ విమానం ల్యాండింగ్ కోసం ఎలాంటి రన్‌వే అవసరం లేదని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అవయవమార్పిడి సమయంలో నగరంలోని ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించడానికి ఈ విమానం ఉపయోగపడుతుందని వెల్లడించారు.