Nityananda statue: నిత్యానందస్వామికి 18 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు ఓ భక్తుడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. బాలసుబ్రమణ్యం అనే భక్తుడు పెరంబాయి గ్రామంలోని ఐశ్వర్య నగర్లో ఈ విగ్రహాన్ని నెలకొల్పాడు. దీంతో పాటు మలేసియాలోని ప్రఖ్యాత మురుగన్ ఆలయం మాదిరిగా 27 అడుగుల విగ్రహాన్ని నిర్మించాడు. తన గ్రామంలో నిర్మించిన ఈ ఆలయానికి బాతుమలై మురుగన్ అని నామకరణం చేశాడు. ఈ ఆలయ ప్రారంభంలోనే 18 అడుగుల నిత్యానంద విగ్రహాన్ని ప్రతిష్ఠించి కుంభాభిషేకం నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
అయితే, శివుడి రూపంలో ఉన్న విగ్రహాన్ని చూసి ఇది నిత్యానంద విగ్రహం కాదని.. కాలభైరవుడిని చెక్కగా సరైన రూపం రాకపోవడం వల్ల ఇలా జరిగిందని అభిషేకానికి హాజరైన శివాచార్యులు అన్నారు. కానీ బాలసుబ్రమణ్యం గదిలో మాత్రం అనేక నిత్యానంద ఫొటోలు ఉన్నాయి. ఆయనతో ఆశీస్సులు పొందిన, పూజించిన చిత్రాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి, మంత్రులను ఆహ్వానించగా.. పలువురు ఎమ్మెల్యేలు మాత్రం హాజరయ్యారు. కొంత మంది భక్తులు విగ్రహం ఎదుట నిలబడి ఫొటోలు దిగారు.