తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బాల భగీరథుడు'.. తాగు నీటి కష్టాలు చూడలేక.. 24 అడుగుల బావి తవ్విన సృజన్

కర్ణాటకకు చెందిన ఓ 17 ఏళ్ల యువకుడు ఒంటరిగా 24 అడుగుల బావిని తవ్వాడు. దీంతో తన ఇంట్లో నెలకొన్న తాగునీటి సమస్యను తీర్చి 'బాల భగీరథుడి'గా అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడి గురించి మరిన్ని విషయాలు మీ కోసం..

17 year boy dig 24 feet water well in karnataka
కర్ణాటకలో 24 అడుగుల బావిని తొవ్విన 17 ఏళ్ల బాలుడు

By

Published : Apr 11, 2023, 8:41 PM IST

'ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురుచూడకు.. నీ వంతు ప్రయత్నం చెయ్' అనే నానుడిని నమ్మి భగీరథ ప్రయత్నం చేశాడు కర్ణాటకకు చెందిన 17 ఏళ్ల యువకుడు. తన ఇంట్లో నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని నిర్ణయించుకొని.. ఎవరి సాయం తీసుకోకుండా ఒంటరిగా 24 అడుగుల లోతైన బావిని తవ్వాడు.

దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళలోని నరికొంబు నైలా గ్రామానికి చెందిన లోకనాథ్ పూజారి, మోహిని దంపతుల కుమారుడు సృజన్​ పూజారి. ఇతడు బంట్వాళలోని బీ మూడ ప్రభుత్వ కళాశాలలో కామర్స్ స్ట్రీమ్​​లో డిగ్రీ చదువుతున్నాడు. ఇంట్లో తాగు నీటి సమస్య తీవ్రతను గమనించిన సృజన్.. ఎలాగైనా బావిని తవ్వి కొంతైనా నీటి సమస్యను తీర్చాలనుకున్నాడు. ఇంటి ముందు పెరట్లో బావిని తవ్వితే నీరు వస్తాయని గ్రహించిన సృజన్.. తన పని ప్రారంభించాడు. ఎవరి సాయం తీసుకోకకుండా ఒంటరిగానే బావిని తవ్వాడు సృజన్. యువకుడు తవ్విన బావిలో నడుములోతు వరకు నీళ్లు వస్తున్నాయి. ఓ మోటార్ సాయంతో నీటిని తోడుకుంటున్నారు.

సృజన్​ పూజారి తవ్విన 24 అడుగుల లోతైన బావి

"మా ఊరిలో చాలా ఏళ్లుగా తాగునీటి సమస్య ఉంది. ఎలాగైనా ఈ సమస్యను అధిగమించాలని అనుకున్నాను. కానీ నేనొక్కడినే బావి ఎలా తవ్వగలను అని అనుకునేవాడ్ని. చివరకు ఓ ప్రయత్నం చేద్దాం.. వస్తే నీళ్లు వస్తాయి.. లేదంటే లేదు అనుకున్నా. గతేడాది డిసెంబర్‌లో ఖాళీగా ఉన్నప్పుడు బావిని తవ్వడం మొదలుపెట్టాను. కొన్నిరోజుల తర్వాత నా కాలేజీ ప్రారంభమైంది. దీంతో బావి తవ్వకానికి కాస్త విరామం ఇచ్చాను. మళ్లీ డిగ్రీ కాలేజీలకు సెలవులు వచ్చిన తర్వాత.. తిరిగి తవ్వడాన్ని కొనసాగించాను. ప్రతిరోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తవ్వేవాడ్ని. కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ సాయంత్రం పని మొదలుపెట్టేవాడ్ని. కొద్ది రోజులకే బావిని 24 అడుగుల లోతు వరకు తవ్వగలిగాను. ప్రస్తుతం బావిలో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి."
-సృజన్​ పూజారి, బావి తవ్విన యువకుడు.

"అమ్మా.. ఎలాగైనా బావిని తవ్వి మన నీటి కష్టాలు తీరుస్తానని మా అబ్బాయి ఎప్పుడూ చెప్పేవాడు. ఈ విషయంలో నా సహాయం అడిగాడు. కానీ నా ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల నేను వాడికి ఎటువంటి సహాయం అందించలేదు. ఒంటరిగానే బావిని తవ్వాడు. ఇప్పుడు ఇంట్లో తాగు నీటి సమస్య తీరింది. ఈ విషయంలో ఇరుగుపొరుగు వారు కూడా వచ్చి పుజారిని మెచ్చుకుని ప్రోత్సహించేవారు. నా కొడుకు చేసిన ఈ మంచి పని పట్ల సంతోషంగా ఉంది. అలాగే గర్వంగా కూడా అనిపిస్తోంది" అని సృజన్ తల్లి మోహిని చెబుతున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details