17 Patients Died in Single Night in Hospital :మహారాష్ట్ర.. ఠాణే జిల్లా కల్వాలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో ఒక్కరాత్రిలో 17 మంది రోగులు మృతి చెందారు. శనివారం రాత్రి 10.30 నుంచి ఆదివారం ఉదయం 8.30 గంటల మధ్యలో ఈ మరణాలు సంభవించాయి. అందులో 12 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నవారు కాగా.. మరో ఐదుగురు ఇతర వార్డుల్లో వైద్యం తీసుకుంటున్నారు.
ఈ స్థాయిలో మరణాలు నమోదు కావడం వల్ల.. ఆసుపత్రిలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. మృతుల సంఖ్యను ఆసుపత్రి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. రోగుల తాకిడికి అనుగుణంగా వైద్యులు లేకపోవడం వల్లే ఈ మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది. ఆగస్టు 10న కూడా ఇదే ఆసుపత్రిలో ఒక్క రోజులోనే ఐదుగురు చనిపోయారు. అప్పుడు స్థానిక నాయకులు ఇక్కడ ఆందోళన సైతం చేపట్టారు.
"చనిపోయిన వారిలో కొంత మంది రోగులు ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చారు. చివరి క్షణంలో వీరు ఆసుపత్రికి రావడం వల్ల ఏం చేయలేకపోయాం. మరికొంత మంది 80 ఏళ్లు దాటిన వృద్ధులు ఉన్నారు. ఈ మధ్యే ఠాణే సివిల్ ఆసుపత్రి మూసివేశారు. దీంతో ఎక్కువ మంది రోగులు ఇక్కడికే వస్తున్నారు." అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ ఆస్పత్రిలో సరైన సదుపాయలు లేకపోవడం, వైద్యుల కొరత ఉండటం వల్ల.. ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని వారు వాపోయారు.