17 Minutes Of Terror Chandrayaan 3 :జాబిల్లి దక్షిణ ధ్రువంపైచంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసి చరిత్ర సృష్టించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధంగా ఉంది. అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈసారి చంద్రయాన్-3ను పకడ్బంధీగా తయారు చేశారు. చంద్రయాన్-2 సమయంలోనూ చివరి కొద్ది నిమిషాల వరకు అంతా సాఫీగానే సాగింది. ఇంచుమించుగా గమ్యస్థానం వరకూ వెళ్లగలిగింది. కానీ చిన్నపాటి లోపాల కారణంగా జాబిల్లిపై ల్యాండర్ కూలిపోయింది. ఈ సమస్యలే మళ్లీ ఉత్పన్నం కాకుండా ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది. చందమామ దక్షిణ ధ్రువంపై దిగేందుకు అత్యంత కీలకమైన, సంక్లిష్టమైన చివరి 17 నిమిషాలను ఎదుర్కొనేలా ల్యాండర్‌ను ఇస్రో సిద్ధం చేసింది. ఈ 17 నిమిషాలను ఎనిమిది దశల్లో ఇస్రో నిర్వహించనుంది.
17 నిమిషాలు చాలా కీలకం..
Chandrayaan 3 Landing Date :జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్ దిగే ల్యాండింగ్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు ప్రారంభం కానుంది. ల్యాండర్ దిగిన తర్వాత అందులో నుంచి రోవర్ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు బయటకు రానుంది. టెర్రర్ ఆఫ్ 17 మినిట్స్‌గా పిలిచే ఆ 17 నిమిషాల సమయమే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలను కాస్త కలవరపెడుతోంది. గతంలో చంద్రయాన్- 2 విషయంలో ఈ సమయంలోనే సాంకేతిక లోపం తలెత్తి ల్యాండర్ కూలిపోయింది. ఈ సారి అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనేలా విక్రమ్ ల్యాండర్‌ను తయారు చేశారు. ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ 134x25 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ కక్షలో పరిభ్రమిస్తున్నప్పుడు విక్రమ్ ల్యాండర్ చంద్రునికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు జాబిల్లి ఉపరితలంపై దిగే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి సెకనుకు 1.68 కిలోమీటర్ల వేగంతో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి దూసుకుపోతుంది. అంటే ఆ సమయంలో ల్యాండర్ వేగం గంటకు 6,048 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది విమాన వేగం కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ.
ల్యాండింగ్ అయ్యే ముందు స్కానింగ్..
ఇంత వేగంతో వెళ్తున్న విక్రమ్ ల్యాండర్‌ను భూమిపై నుంచి శాస్త్రవేత్తలు నియంత్రించలేరు. ఎందుకంటే భూమ్మీద నుంచి చంద్రుడి మీద ఒక రేడియో సిగ్నల్ పంపించడానికి సుమారు 1.3 సెకన్ల సమయం పడుతుంది. తిరిగి రావడానికి అంతే సమయం పడుతుంది. సిగ్నల్ పంపి అది భూమ్మీదకు చేరాలంటే 2.6 సెకన్ల సమయం పడుతుంది. గంటకు కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో చంద్రుడి మీదకు వెళ్లే ల్యాండర్‌ను నియంత్రించాలంటే రెండున్నర సెకన్ల సమయం పడుతుంది. ఇది సాధ్యం కాదు. అందుకే విక్రమ్ ల్యాండర్ ఆటోమెటిక్‌గా తనంతట తానే ల్యాండయ్యేలా ప్రోగ్రామ్ చేశారు. వేగాన్ని నియంత్రించేందుకు విక్రమ్ ల్యాండర్.. తన నాలుగు థ్రస్టర్ ఇంజిన్‌లను మండిస్తుంది. దీనిని పవర్డ్ బ్రేకింగ్ దశ అంటారు. ఇది దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగుతుంది. అనంతరం ఫైన్ బ్రేకింగ్ దశ ఆరంభం అవుతుంది. ఈ దశలోనే చంద్రయాన్-2 ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది. 6.8 కిలోమీటర్లు ఎత్తుకు చేరుకున్నప్పుడు కేవలం రెండు ఇంజన్లను మాత్రమే ఉపయోగించుకుంటూ ల్యాండర్ వేగాన్ని నియంత్రించుకుంటుంది. జాబిల్లి ఉపరితలానికి 100 నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు తనలోని సెన్సార్లు, కెమెరాలు వినియోగించుకుని జాబిల్లి ఉపరితలంపై ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో స్కాన్ చేసి ల్యాండింగ్ చూసుకుంటుంది. ఆపై సాఫ్ట్-ల్యాండింగ్ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది.