సినీఫక్కీలో దుండగులు మణప్పురం గోల్డ్ లోన్ కార్యాలయంలో దోపిడికి పాల్పడ్డారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలోనే 17 కిలోల బంగారం, రూ.5 లక్షల నగదు లూటీ చేశారు. ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలోని కమలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దోపిడి జరిగింది.
శనివారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఆరుగురు దుండగులు తుపాకులతో కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడి సిబ్బందిని బెదిరించి.. 20 నిమిషాల్లోనే మొత్తం లూటీ చేశారు. పారిపోయే క్రమంలో సిబ్బందిని లోపలే ఉంచి తాళం వేశారు. కొందరు అలారం మోగించగా.. చుట్టుపక్కల వారు వచ్చి గేట్ తెరిచారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఏడీజీ రాజీవ్ క్రిష్ణ, ఐజీ నవీన్ అరోరా, ఎస్ఎస్పీ సహా ఇతర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుల కోసం ముమ్మర తనిఖీలు చేపట్టారు. సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. మూడు గంటల్లోనే కేసును ఛేదించారు.
ఎత్మాదపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖందౌలీ రోడ్ ప్రాంతంలో దుండగులు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడికి చేరుకోగా వారిపై కాల్పులకు పాల్పడ్డారు. పోలీసులు, దుండగుల మధ్య జరిగిన కాల్పుల్లో మనీశ్ పాండే, కుమార్ అనే వ్యక్తులకు తూటాలు తగిలాయి. ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. వారి నుంచి రెండు తుపాకులు, లూటీ చేసిన సగం సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్ నుంచి నరేంద్ర అలియాస్ లాల్, అన్షులు తప్పించుకుని పారిపోయారు.
ఇదీ చూడండి:వైద్యరంగంలో నూతన పోకడలు.. కశ్మీర్‌లో శిక్షణ శిబిరం