తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాధ్యమమే ప్రతిబంధకం-మాతృభాషలో వృత్తి విద్య! - 15th finance commission suggested to introduce mother tongue in engineering and medicine from 2021

సాంకేతిక, వృత్తి విద్య కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. ప్రతి రాష్ట్రానికి ఒక ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలను ఎంపిక చేసి వాటిలో ప్రాంతీయ భాషలో చదువు చెప్పేందుకు ప్రోత్సాహం అందించాలని పేర్కొంది. ఇందుకోసం రానున్న అయిదేళ్లలో రూ.1,065 కోట్లు దీనికోసం ఖర్చుపెట్టాలని సిఫార్సు చేసింది.

15th finance commission suggested to introduce mother tongue in engineering and medicine from 2021
మాధ్యమమే ప్రతిబంధకం-మాతృభాషలో వృత్తి విద్య!

By

Published : Feb 15, 2021, 8:07 AM IST

Updated : Feb 15, 2021, 8:43 AM IST

ఉన్నత విద్యలో గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల మధ్య అంతరాలు తగ్గించేందుకు ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ వంటి వృత్తి విద్యా కోర్సులను సైతం ప్రాంతీయ భాషల్లో బోధించాలన్న డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. సాంకేతిక, వృత్తి విద్య కోర్సులను ప్రాంతీయ భాషల్లో బోధించాలని తాజాగా కేంద్ర ప్రభుత్వానికి 15వ ఆర్థిక సంఘం కూడా సిఫార్సు చేసింది. ఇందుకోసం ప్రతి రాష్ట్రానికి ఒక ఇంజినీరింగ్‌, మరో వైద్య కళాశాలను ఎంపిక చేసి వాటిలో ప్రాంతీయ భాషలో చదువు చెప్పేందుకు ప్రోత్సాహం అందించాలని పేర్కొంది. ఇందుకోసం 2021నుంచి 2026 వరకు ఒక్కో రాష్ట్రానికి మొత్తం రూ.38 కోట్లు కేటాయించాలని, మొత్తంగా రానున్న అయిదేళ్లలో రూ.1,065 కోట్లు దీనికోసం ఖర్చుపెట్టాలని సిఫార్సు చేసింది. నూతన జాతీయ విద్యావిధానంలోనూ వృత్తి విద్యలో ప్రాంతీయ భాషకు అవకాశం కల్పించడంపై దృష్టి సారించాలని ఆర్థిక సంఘం ఛైర్మన్‌ ఎన్‌కె సింగ్‌ సూచించారు.

అర్థవంతంగా చదువు!

దేశంలో 70 శాతానికి పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. అత్యధికులు ఇంటర్‌ వరకు మాతృభాషలోనే చదువుతున్న దేశం మనది. అనంతరం ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర వృత్తి విద్యా కోర్సులకు వచ్చేసరికి ఒకేసారి ఆంగ్ల మాధ్యమానికి మారాల్సి వస్తోంది. దీంతో చాలామంది చదువులో వెనకబడుతున్నారు. పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడంలో ఆంగ్ల భాష వారికి ప్రధాన అవరోధంగా నిలుస్తోందని పలు అధ్యయనాల్లో తేలింది. మాతృభాషల్లో చదువుకుని అప్పటిదాకా ప్రతిభావంతులుగా పేరు గడించినవారు సైతం చదువులో వెనకబడిపోతున్నారు. సాధారణ, మధ్యస్థాయి విద్యార్థులయితే పాఠ్యాంశాలు అర్థం చేసుకోలేక అర్ధాంతరంగా చదువు మానేస్తున్నారు. తొమ్మిది, పదో తరగతుల్లో 80శాతంగా ఉంటున్న విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్‌) ఉన్నత విద్య స్థాయిలో 26శాతానికి పడిపోతోందని జాతీయ ఉన్నత విద్య సర్వే వెల్లడించింది. ఈ నేపథ్యంలో వృత్తివిద్యా కోర్సులనూ మాతృభాషలో బోధించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఇటీవల కేంద్ర విద్యాశాఖ, ఇంజినీరింగ్‌తోపాటు ఇతర సాంకేతిక కోర్సులను ప్రాంతీయ భాషల్లో అందించే క్రమంలో సాధ్యాసాధ్యాలు చర్చించేందుకు ఓ కార్యదళాన్ని ఏర్పాటు చేసింది.

మాతృభాషలోనే విద్యాభ్యాసం అనేది పేరొందిన చాలా దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న విధానం. జర్మనీ, ఫ్రాన్స్‌, రష్యా, జపాన్‌ వంటి దేశాలు ఆంగ్లంలోనేకాక వారి మాతృభాషలోనూ విద్యను అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యా వ్యవస్థలుగా పేరొందాయి. చైనాలో మాండరిన్‌ సహా ఎనిమిది ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన కొనసాగుతోంది. భారత్‌లో ఐఐటీలు, ఎన్‌ఐటీ వంటి అత్యున్నత విద్యాసంస్థలు; ఇంజినీరింగ్‌, వైద్య కళాశాలల్లో బోధన అంతా ఆంగ్లంలోనే సాగుతుండటం ప్రాంతీయ భాషల్లో చదువుకున్న విద్యార్థులకు మింగుడు పడటం లేదన్నది ప్రధానమైన విమర్శ. దీనికి సాంకేతికతే పరిష్కారమని కొన్ని ఐఐటీలు భావిస్తున్నాయి. పాఠ్యాంశాలు, పరిశోధనలు, ఆవిష్కరణల సారాంశాన్ని సాంకేతిక సాయంతో ప్రాంతీయ భాషల్లోకి అనువదించగలిగే ప్రయత్నాలు జరగాలని ఐఐటీ ఖరగ్‌పూర్‌ సంచాలకులు వీరేంద్రకుమార్‌ తివారీ అంటున్నారు. కృత్రిమమేధ ఆధారిత అనువాదానికి ఏఐసీటీఈ ఇప్పటికే ఒక ఉపకరణ తీసుకొచ్చింది. ఇంజినీరింగ్‌ ఒకటి, రెండు సంవత్సరాల పాఠాలను హిందీ, బెంగాలీ, గుజరాతీ, తమిళం వంటి ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం దీనితో సాధ్యమవుతుందని ఏఐసీటీఐ ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్దే అభిప్రాయపడుతున్నారు. ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ వంటి కోర్సులు బోధించడం కొత్త విషయమేమీ కాదన్నది ఆయన ఆలోచన. రాజస్థాన్‌లో ఇంజినీరింగ్‌ డిప్లొమా హిందీలోనూ చదవొచ్చు, అలాగే తమిళనాడులో తమిళ భాషలో ఇంజినీరింగ్‌ చేసే అవకాశం ఉంది. నేషనల్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ పోర్టల్‌ ఇప్పటికే ఇంజినీరింగ్‌, ఫార్మసీ, డిగ్రీ, పీజీ స్థాయిలో సైన్సు కోర్సులకు సంబంధించిన పాఠాలను ఆంగ్లం నుంచి అనువదించింది.

కాలానుగుణంగా మారాలి

వృత్తివిద్యా కోర్సులనూ మాతృభాషలోనే బోధించాలన్న ప్రతిపాదనను మరికొందరు తప్పుపడుతున్నారు. ఐఐటీల్లో ప్రాంతీయ భాషల్లో బోధించడం మొదలుపెడితే వాటి పతనానికి అదే నాంది అవుతుందని ఐఐటీ దిల్లీ సంచాలకులు వి.రామ్‌గోపాల్‌రావు వ్యాఖ్యానించారు. ‘జేఈఈ అడ్వాన్స్‌ పరీక్ష హిందీలో రాసిన 100 మంది విద్యార్థులు ఏటా ఐఐటీ దిల్లీలో చేరుతున్నారు. వీరికి ఆంగ్ల భాషలో పాఠాలు అర్థం చేసుకోలిగేలా సంస్థ ఎంతో మద్దతుగా నిలుస్తోంది. ఆరు నెలల నుంచి ఏడాదిలోపే వారంతా ఆంగ్లంలో మెలకువలు నేర్చుకుని మొదటి నుంచి ఆంగ్ల మాధ్యమం చదువుకున్న విద్యార్థులతో పోటీ పడుతున్నారు’ అన్నది ఆయన భావన. ప్రపంచవ్యాప్తంగా పరిశోధన, ఆవిష్కరణల్లో కొత్త కొత్త అంశాలను ఎప్పటికప్పుడు ఐఐటీ పాఠ్యాంశాల్లో చేరుస్తుంటామని, వీటిని ప్రాంతీయ భాషలోనో, విద్యార్థి మాతృభాషలోనే బోధించడం సాధ్యం కాకపోవచ్చన్నది ఆయన అభిప్రాయం. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా, గ్రామీణ విద్యార్థులకు చేరువ కాలేని ఉన్నత విద్యకు అర్థం లేదు. లక్షల సంఖ్యలోని గ్రామీణ విద్యార్థుల భాషా సమస్యలను దృష్టిలో పెట్టుకొని- ఉన్నత విద్యను ఏ రకంగా వారికి చేరువ చేయగలమన్నదే ప్రభుత్వాల విధానం కావాలి.

- శ్యాంప్రసాద్‌ ముఖర్జీ కొండవీటి

Last Updated : Feb 15, 2021, 8:43 AM IST

ABOUT THE AUTHOR

...view details