తెలంగాణ

telangana

ETV Bharat / bharat

15ఏళ్లకే డిగ్రీ పూర్తి!.. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావడమే టార్గెట్.. తండ్రి లేకపోయినా మోదీ స్ఫూర్తితో.. - Madhya Pradesh Tanishka Sujit

మధ్యప్రదేశ్​కు చెందిన ఓ విద్యార్థిని తన 15వ ఏటనే డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతోంది. అంతేకాకుండా విదేశంలో న్యాయశాస్త్రం చదివి భారత దేశ ప్రధాన న్యాయమూర్తి కావాలనేది తన లక్ష్యమని చెబుతోంది.

pm modi words to mp girl who wants to become a cji
15ఏళ్ల వయసులోనే బీఏ పరీక్షలు రాస్తున్న అమ్మాయి తనిష్క సుజిత్

By

Published : Apr 11, 2023, 6:21 PM IST

సాధారణంగా ఏ విద్యార్థి అయినా 21 ఏళ్లు వచ్చేనాటికి డిగ్రీ విద్యను పూర్తి చేస్తారు. కానీ, మధ్యప్రదేశ్​​కు​ చెందిన ఓ విద్యార్థిని మాత్రం తన 15 ఏళ్ల వయసులోనే డిగ్రీ బీఏ(బ్యాచిలర్​ ఆఫ్​ ఆర్ట్స్​) తుది సంవత్సరం వార్షిక పరీక్షలు రాయబోతోంది. అలాగే న్యాయశాస్త్రంలో విద్యనభ్యసించి చీఫ్​ జస్టిస్​ ఆఫ్​ ఇండియా కావాలన్న తన కలను నెరవేర్చుకుంటానని చెబుతోంది. ఈనెల మధ్యప్రదేశ్​ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన కలను నెరవేర్చుకునేందుకు అందించిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేసిందీ కాబోయే యంగ్​ గ్రాడ్యుయేట్​.

మధ్యప్రదేశ్​​లోని ఇందౌర్​కు చెందిన 15 ఏళ్ల తనిష్క సుజిత్ చిన్నప్పటి నుంచే చదువులో మేటి. పదో తరగతిలో ఫస్ట్​ డివిజన్​లో ఉత్తీర్ణత సాధించిన ఈమె తన 13 సంవత్సరాల వయసులోనే ఇంటర్మీడియెట్​ విద్యను పూర్తి చేసింది. కాగా, ఈ నెల 19 నుంచి మధ్యప్రదేశ్​లోని దేవి అహల్య యూనివర్సిటీ పరిధిలో జరిగే బీఏ(సైకాలజీ) చివరి సంవత్సరం పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతోంది. అయితే 2020లో కరోనా కారణంగా తనిష్క తండ్రి, తాతయ్యలు మరణించారు. దీంతో అప్పటి నుంచి తల్లి అనూభ సంరక్షణలో ఉంటూ చదువులో రాణిస్తోంది సుజిత్​.

ఈనెల 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు మధ్యప్రదేశ్​ భోపాల్​కు వచ్చారు. ఈ క్రమంలో సుజిత్​కు మోదీతో కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. దాదాపు 15 నిమిషాల పాటు బాలికతో ముచ్చటించారు ప్రధాని మోదీ. ఈ సమయంలో తాను బీఏ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. అమెరికాలో న్యాయశాస్త్రం చదవాలనుకుంటున్నానని ఆయనతో చెప్పింది. అలాగే ఏదో ఒక రోజు తాను భారత ప్రధాన న్యాయమూర్తిని కావాలన్న కలను నెరవేర్చుకుంటానని మోదీ దగ్గర తన ఆకాంక్షను వెలిబుచ్చింది.

"నా లక్ష్యం గురించి తెలుసుకున్న పీఎం సర్​.. సుప్రీంకోర్టుకు వెళ్లి అక్కడ న్యాయవాదులు ఎలా వాదిస్తున్నారో చూడాలని నాకు సలహా ఇచ్చారు. ఈ మాటలను నాలో మరింత స్ఫూర్తిని నింపాయి. వీటిని ప్రేరణగా తీసుకుని నా కలను నెరవేర్చుకుంటాను. అలాగే ప్రధాన మంత్రిని కలవాలన్న నా చిరకాల వాంఛ కూడా నెరవేరింది."
- తనిష్క సుజిత్

"నా భర్త, మామయ్య 2020లో కరోనా కారణంగా మరణించారు. అయినా సరే చదువులో రాణిస్తున్న నా కూతురి కోసం కష్టపడి చదివిస్తున్నాను" అని సుజిత్​ తల్లి అనూభ అన్నారు.
"తనిష్క సుజిత్​ ఎంతో ప్రతిభావంతురాలు. ఆమెకు 13వ ఏటనే యూనివర్సిటీ నిర్వహించిన ఎంట్రెన్స్​ ఎగ్జామ్​లో మంచి మార్కులు రావడం వల్ల సుజిత్​కు బీఏ (సైకాలజీ)లో ప్రవేశం కల్పించాము" అని దేవి అహల్య విశ్వవిద్యాలయం సోషల్ సైన్స్ స్టడీస్ విభాగాధిపతి రేఖా ఆచార్య చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details