1430 KM Shraddha Run To Ayodhya :అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రన్నింగ్ ద్వారా వెళ్లేందుకు సిద్ధమయ్యారు గుజరాత్ నవ్సారి జిల్లాకు చెందిన కొందరు యువతీయువకులు. జిల్లాలోని బిలిమోరా ప్రాంతం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరానికి పరుగు ద్వారా చేరుకునే కార్యక్రమానికి తాజాగా శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర మొత్తం 1430 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. శ్రద్ధా రన్ పేరుతో ఈ మారథాన్‌ను నిర్వహిస్తున్నారు.
"ప్రస్తుతం నేను ఆర్మీకి సిద్ధమవుతున్నా. మేము బిలిమోరాలోని సోమనాథ్ మహాదేవ్ ఆలయం నుంచి అయోధ్యలోని రామమందిరం వరకు చేపట్టిన పరుగు యాత్రలో పాల్గొంటున్నాము. ఇది మాకు ఎంతో గర్వకారణం, సంతోషకరం. ఈనెల 22న జరిగే శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి మేము హాజరవుతాము."
- ఆర్తీ, రన్నర్
ఈ మారథాన్ కార్యక్రమాన్ని నవ్సారి జిల్లా బిలిమోరాకు చెందిన ప్రగతి చారిటబుల్ ట్రస్టు నిర్వహిస్తోంది. వీరి ఆధ్వర్యంలోనే మొత్తం 30 మంది బిలిమోరా నుంచి పరుగు ద్వారా అయోధ్యకు చేరుకునేందుకు ముందడుగు వేశారు. ఇందులో 26 మంది యువకులు కాగా, మిగతా నలుగురు యువతులు ఉన్నారు.
"ఈ పరుగు యాత్రలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము బిలిమోరా నుంచి 1430 కి.మీ దూరంలో ఉన్న అయోధ్యకు రన్నింగ్ ద్వారా చేరుకుంటాము. 500 ఏళ్ల తర్వాత శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొంటున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈ రేసులో ప్రతిరోజూ 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించనున్నాం. ఈ మారథాన్ కోసం గత 3-4 నెలలుగా మేము సిద్ధమవుతున్నాము."
- ఓం పటేల్, అథ్లెట్