మహారాష్ట్ర నాశిక్‌కు చెందిన గీత్ పత్ని అరుదైన ఘనత సాధించింది. 14 ఏళ్ల వయసులోనే ప్రపంచంలోని రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్‌ను సంపాదించింది. 'ఫోన్ అధిక వినియోగం వల్ల పిల్లలపై పడే ప్రభావాలు' అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్లు వరించాయి. ఏకకాలంలో రెండు ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా గీత్ పత్ని రికార్డు సాధించినట్లు ఆమె తల్లిదండ్రులు చెప్పారు.
నాశిక్‌కు చెందిన గీత్ పత్ని.. స్థానిక నిర్మలా కాన్వెంట్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి పరాగ్ పత్ని, తల్లి కాజల్ పత్ని ఇద్దరూ వైద్యులే. పరాగ్, కాజల్ శారీరక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. తల్లిదండ్రులిద్దరినీ చూస్తూ పెరిగిన గీత్ కూడా ఫిట్నెట్పై ఆసక్తి కనబరిచేది. దీంతో యోగాపై మాస్టర్స్ పూర్తి చేయడమే కాకుండా.. అనేక మందికి శిక్షణ ఇస్తోంది.
ఈ క్రమంలోనే దేశంలో కరోనా విజృంభించింది. లాక్‌డౌన్‌తో పాఠశాలలు మూతపడడం వల్ల పిల్లల్లో ఫోన్ వాడకం మితిమీరిపోయింది. ఇలా అధికంగా ఫోన్ వినియోగంతో పిల్లల ఆరోగ్యం చెడిపోతుందని గ్రహించింది గీత్ పత్ని. దీనిపై కలత చెందిన చిన్నారి.. ఈ అంశంపై పరిశోధన పత్రాన్ని రూపొందించి ప్రపంచంలోని ఏడు ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలకు పంపించింది. ఈ పత్రాలను పరిశీలించిన కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాలు.. గీత్‌కు డాక్టరేట్‌ను ప్రకటించాయి.
"ఫోన్ వినియోగంపై పిల్లల తల్లిదండ్రుల వద్ద నుంచి వివరాలు సేకరించి.. పరిశోధన పత్రాన్ని రూపొందిచా. నేను ఏం చేస్తున్నానో నా తల్లిదండ్రులకు తెలియదు. పరిశోధన మొత్తం పూర్తయ్యాక చెప్పాను. వారు పరిశోధన పత్రం చూసి బాగుందని.. దీనిని విశ్వవిద్యాలయాలకు పంపించారు. మొత్తం ఏడు విశ్వవిద్యాలయాలకు పంపించగా.. కొలంబియా, ఘనా విశ్వవిద్యాలయాల నుంచి డాక్టరేట్ వచ్చింది."
-గీత్ పత్ని, డాక్టరేట్ గ్రహీత