2019-20 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర సమితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆప్, డీఎంకే సహా 14 ప్రాంతీయ పార్టీలకు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ. 447.49కోట్లు విరాళాలుగా అందాయి. అన్నింటినీ కలుపుకుంటే.. ఆయా పార్టీల ఆదాయంలో ఈ మొత్తం 50.97శాతం. ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్) ఈమేరకు ఓ నివేదిక రూపొందించింది.
2019-20 కాలానికి మొత్తం 42 ప్రాంతీయ పార్టీల ఆర్థిక వ్యవహారాలను విశ్లేషించింది ఏడీఆర్. మొత్తం ఆదాయం రూ. 877.957కోట్లుగా తేలింది. ఈ 42 పార్టీల్లో 14 మాత్రమే విరాళాల వివరాలను బయటపెట్టినట్టు ఏడీఆర్ స్పష్టం చేసింది.
తెరాస టాప్...
- ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళాలు పొందడంలో తెరాస టాప్లో నిలిచింది. ఆ పార్టీ ఆదాయం రూ. 130.46కోట్లు. విశ్లేషణకు పరిగణించిన అన్ని పార్టీల మొత్తం ఆదాయంలో ఒక్క తెరాస వాటానే 14.86శాతం.
- తర్వాతి స్థానాల్లో.. శివసేన(రూ. 111.403కోట్లు-12.69శాతం), వైకాపా(రూ. 92.739కోట్లు-10.56శాతం) ఉన్నాయి.
- 39 పార్టీల మొత్తం ఆదాయం.. 2018-19(రూ. 1087.206కోట్లు)తో పోల్చుకుంటే.. 2019-20లో(రూ. 874.467కోట్లు) తగ్గింది. ఇది 19.57శాతం.
- 2019-20లో అందిన ఆదాయాన్ని 24 ప్రాంతీయ పార్టీలు ఇంకా ఖర్చుపెట్టలేదు. తెరాస మొత్తం ఆదాయంలో 83.76శాతాన్ని ఇంకా ఖర్చు చేయలేదు. అన్నాడీఎంకే, జేజేపీకి 67.82, 64శాతం ఆదాయం మిగిలే ఉంది.
- 2019-20కి గాను 18 పార్టీలు.. తమ ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేశాయి. తెలుగు దేశం పార్టీ, బిజూ జనతా దళ్, డీఎంకే, ఎస్పీ, జేడీఎస్, ఏజేఎస్యూ, జేవీఎం-పీ, ఐఎన్ఎల్డీ, పీఎంకే, ఎంజీపీ, జీఎప్పీ, ఎస్డీఎఫ్, ఎంఎన్ఎఫ్, ఏఐఎఫ్బీ, ఎన్పీఎఫ్, జేకేపీడీపీ, ఐపీఎఫ్టీ, ఎంపీసీ ఈ జాబితాలో ఉన్నాయి. బీజేడీ ఎక్కువ ఖర్చు చేసింది(106.01శాతం/ రూ. 95.78కోట్లు).