ఈ ఏడాది చివరినాటికి మానవ రహిత అంతరిక్ష యాత్ర సహా మొత్తం 14 ప్రయోగాలు చేపట్టనున్నట్లు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఛైర్మన్ శివన్ వెల్లడించారు. పీఎస్ఎల్వీ సీ-51 వాహకనౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనంతరం మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఏడు వాహకనౌకలు, ఆరు ఉపగ్రహ ప్రయోగాలు సహా ఈ ఏడాది చివరి నాటికి మొదటి మానవరహిత మిషన్ లక్ష్యంగా శాస్త్రవేత్తలు శ్రమిస్తున్నట్లు శివన్ తెలిపారు. గగన్‌యాన్‌కు ముందు రెండు మానవ రహిత అంతరిక్ష యాత్రలు చేపట్టాలని ఇస్రో యోచిస్తోందన్నారు. ఇస్రో నిర్దేశించుకున్న అన్ని లక్ష్యాలను చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.