ఓ సైబర్ హ్యాకర్ 13 ఏళ్ల చిన్నారిని ట్రాప్ చేసి.. అతడి కుటుంబ సభ్యుల అందరి ఫోన్లను హ్యాక్ చేశాడు. ఈ ఘటన రాజస్థాన్ జైపుర్‌లోని హర్మడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తాను చెప్పిన పని చేయాలని లేకుంటే.. తల్లిదండ్రులను చంపేస్తామంటూ బెదిరించడం వల్ల భయపడి.. హ్యాకర్ చెప్పిందల్లా చేశాడు ఆ బాలుడు. చివరకు ఈ విషయం పోలీసుల వరకు వెళ్లగా అసలు సంగతి బయటకు వచ్చింది.
జరిగింది ఇదీ..
రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన 8వ తరగతి చదువుతున్న బాలుడు.. మొబైల్‌లో ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతుంటాడు. అతడికి కొంతమందితో స్నేహం ఏర్పడింది. అందులో హ్యాకర్ కూడా ఉన్నాడు. ఈ క్రమంలో అతడికి ఒక లింక్ పంపి.. అందులో కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు పంపాలని కోరాడు. అడిగిన సమాచారం మొత్తాన్ని ఆ బాలుడు ఇచ్చేశాడు. ఓటీపీలను కూడా హ్యాకర్‌కు షేర్ చేశాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల మొబైల్‌లో హ్యాకింగ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో బాలుడి తల్లిదండ్రులకు చెందిన 3 ఫోన్లను హ్యాక్ చేసి.. వారికి తెలియకుండా సోషల్ మీడియాలో అసభ్యకర ఫొటోలు, పోస్టులు పెట్టడం ప్రారంభించాడు.