పంజాబ్ చండీగఢ్‌లో(Chandigarh News) షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. 13 మంది కామాంధుల చేతిలో నలిగిపోయిన 14 ఏళ్ల బాలికను రైల్వే పోలీసులు రక్షించారు. అనంతరం.. చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు అప్పగించారు. బాధిత బాలికతో.. చైల్డ్ హెల్ప్‌లైన్ డైరెక్టర్ సంగీతా జంద్ మాట్లాడగా.. తనపై జరిగిన దారుణాన్ని బాలిక బయటపెట్టింది.
అసలేం జరిగింది?
పుణెకు చెందిన బాలిక.. తన స్నేహితునితో కలిసి చండీగఢ్‌కు వెళ్లాలని ప్రయత్నించింది. ముంబయి రైల్వే స్టేషన్(Mumbai Railway Station)లో తనను కలుస్తానని ఆమె స్నేహితుడు చెప్పాడు. దాంతో తల్లిదండ్రులకు చెప్పకుండానే.. ముంబయి రైల్వే స్టేషన్‌కు చేరుకుంది ఆ బాలిక. అయితే.. ఎంతవెతికినా రైల్వే స్టేషన్లో తన స్నేహితుడు ఆమెకు కనిపించలేదు. ఈ క్రమంలో ఓ ఆటోడ్రైవర్.. రైల్వే స్టేషన్ బయట ఆమె స్నేహితుడు ఎదురు చూస్తున్నాడని నమ్మించి, ఆటోలో తీసుకువెళ్లాడు.
రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బాలికతో ఆటోడ్రైవర్ మద్యం తాగించాడు. పథకం ప్రకారం ఓ ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై 12 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం.. బాధితురాలిని ఓ రైల్వే ఉద్యోగికి అప్పగించి, ఆ ఆటోడ్రైవర్ పరారయ్యాడు. అయితే.. సదరు ఉద్యోగి కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. చండీగఢ్ వెళ్లేందుకు ఆమెకు రైలు టికెట్ ఇచ్చాడని అధికారులు తెలిపారు. చండీగఢ్ రైల్వే స్టేషన్‌కు ఓ బాలుడితో చేరుకున్న ఆ బాలికను రైల్వే పోలీసులు చేరదీసి, చైల్డ్ హెల్ప్‌లైన్ అధికారులకు సమాచారం అందించారు.
పుణె పోలీసులను చండీగఢ్ పోలీసులు సంప్రదించగా.. ఇక్కడ ఓ బాలిక అదృశ్యం కేసు నమోదైనట్లు వారు తెలుసుకున్నారు. దాంతో బాలికను.. పోలీసులు పుణె నగరానికి తిరిగి తీసుకువచ్చారు. ఇప్పటికే.. ఈ కేసులో 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి:'ఎన్‌డీఏలో మహిళల ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్'