దేశంలో నానాటికీ పెరిగిపోతున్న కరోనా తీవ్రత నుంచి ప్రజలను ఆదుకోవడానికి వివిధ దేశాలు అందిస్తున్న సాయాన్నంతా కేంద్ర ప్రభుత్వం తన పరిధిలోని ఆసుపత్రులకే కేటాయించింది. ఇందులో రెండు మినహా మిగిలినవన్నీ కేంద్రం ఆధ్వర్యంలోని ఆసుపత్రులే ఉండటంపట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 1వ తేదీ వరకు భారత్ కు యూకే, ఐర్లాండ్, రొమేనియా, రష్యా, యూఏఈ, అమెరికా, తైవాన్, కువైట్, ఫ్రాన్స్, థాయ్లాండ్, జర్మనీ, ఉజ్బెకిస్థాన్, బెల్జియం, ఇటలీల నుంచి సుమారు 40 లక్షల పరికరాలు రాగా వాటిని దేశంలోని 31 రాష్ట్రాల్లో ఉన్న 38 సంస్థలకు కేటాయించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అందులో దిల్లీలోనే 8 ఉన్నాయి. దక్షిణాదిలో మూడు కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు ఇవి అందాయి.
ప్రైవేటు ఆసుపత్రులకు..
ఫ్రాన్స్ నుంచి వచ్చిన రెండు ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లను దిల్లీలోని అత్యంత ఖరీదైన రెండు ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రులకు కేటాయించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ ప్రాతిపదికన విదేశీ సాయాన్ని ఇలా ధారాదత్తం చేశారని వైద్యనిపుణులు ప్రశ్నిస్తున్నారు. విదేశీ వైద్య సాయాన్ని అందుకున్న రాష్ట్ర ఆసుపత్రుల్లో ఉత్తర్ ప్రదేశ్ లోని పిలీభీత్ జిల్లా ఆసుపత్రి, జైపుర్లోని ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో ఉన్న కేసుల తీవ్రత ఆధారంగా ఈ వస్తువులను పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది.