Amritsar Airport Covid Test: ఇటలీలోని మిలాన్ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చిన ఓ అంతర్జాతీయ ఛార్టెర్డ్ విమానంలో 125 మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ వీకే సేఠ్ గురువారం వెల్లడించారు. విమానంలో మొత్తం ప్రయాణికుల సంఖ్య 179గా ఉందని పేర్కొన్నారు. వీరిలో 19 మంది పిల్లలు కాగా.. వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు వివరించారు. మిగిలిన 160 మందికి పరీక్షలు చేయగా.. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో విదేశీ ప్రయాణికులకు విమానాశ్రయాల్లో పరీక్షలు తప్పనిసరి చేశారు. మరోవైపు పలు రాష్ట్రాలు విదేశాలకు విమాన రాకపోకలపై ఇప్పటికే ఆంక్షలను అమలు చేశాయి. బంగాల్లో వారానికి రెండుసార్లు మాత్రమే యూకేకు విమాన రాకపోకలను అనుమతించింది అక్కడి ప్రభుత్వం.