పొలానికి వెళ్లిన సమయంలో తనపై దాడి చేసిన చిరుతతో వీరోచిత పోరాటం చేశాడు ఓ 12 ఏళ్ల బాలుడు. ఒక చేతికి తీవ్ర గాయమైనా.. మరో చేతితో చిరుతను ఎదుర్కొన్నాడు. గాయమైన చేతికి ఆరుకుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటన మహారాష్ట్ర నాసిక్ జిల్లా సిన్నార్ తాలుకాలోని సోనారీ గ్రామంలో గత మంగళవారం జరిగింది. ఎంతో ధైర్యంతో చిరుత నుంచి తనను తాను కాపాడుకున్న బాలుడిని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఇదీ జరిగింది..
గత మంగళవారం రోజున తన కుటుంబ సభ్యులతో కలిసి పంటభూమి వద్దకు వెళ్లాడు సోనారీ గ్రామానికి చెందిన గౌరవ్ కులంగే. తమ మొక్కజొన్న పంట లోపలికి ఒంటరిగా వెళ్లిన క్రమంలో అందులో ఉన్న చిరుత పులి ఒక్కసారిగా బాలుడిపై దాడి చేసింది. ఒక చేతిపై చిరుత పంజా పడింది. దీంతో షాక్కు గురైన బాలుడు బిగ్గరగా అరుస్తూనే.. మరోవైపు చిరుతపై ఎదురుదాడికి దిగాడు. చిరుత ముఖంపై బలంగా కొట్టటం వల్ల.. దూరంగా వెళ్లిపోయిందని, వెంటనే అక్కడి నుంచి పరుగున కుటుంబ సభ్యుల వద్దకు వచ్చేసినట్లు తెలిపాడు గౌరవ్.