12 Year Old Girl Dead In Odisha : ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో 12ఏళ్ల బాలిక మృతదేహం అనుమానాస్పద రీతిలో చెట్టుకు వేలాడుతూ లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం తరలించారు. మృతురాలిని సరస్వతిగా పోలీసులు గుర్తించారు. అసలేం జరిగిందంటే?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఉడ్లా పోలీస్‌స్టేషన్ పరిధిలోని వాలుహురాడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సీత హసద అనే మహిళ తన కుమార్తె సరస్వతి(12)ని పొరిగింట్లో ఉంచి భువనేశ్వర్‌కు పని మీద వెళ్లింది. బుధవారం సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకుంది. ఆ సమయంలో చెట్టుకు సరస్వతి మృతదేహం వేలాడి ఉండడం గమనించింది.
అయితే తన కుమార్తె బంతిపూల మొక్కలను దొంగలించిందని పొరిగింటి వారే కొట్టి చంపేశారని బాధితురాలి తల్లి ఆరోపించింది. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించేందుకు చెట్టు వేలాడదీశారని ఆరోపణలు చేసింది. మృతదేహంపై గాయాలు ఉన్నట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి తల్లి నుంచి ఫిర్యాదు అందుకున్న ఉడ్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్షల కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
పరువు హత్య కలకలం..
Honor Killing In Karnataka : కర్ణాటకలోని బెంగళూరు జిల్లాలో పరువు హత్యకలకలం రేపింది. వేరే సామాజికవర్గానికి చెందిన యువకుడినిప్రేమిస్తుందని కుమార్తెనుదారుణంగా హత్య చేశాడో తండ్రి. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. బాధితురాలిని కవచగా పోలీసులు గుర్తించారు.
పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం..జిల్లాలోని దేవనహళ్లి తాలుకా బిదలూరు గ్రామంలో జరిగింది. స్థానికంగా చికెన్ షాప్‌లో మంజునాథ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. అతడి ఇద్దరు కుమార్తెలు ప్రేమలో పడ్డారు. అతడి చిన్న కుమార్తె ప్రేమ విషయం ఇటీవలే విశ్వనాథ్పుర్ పోలీస్‌స్టేషన్‌కు చేరింది. ఆమె తన ప్రేమికుడినే వివాహం చేసుకుంటానని పోలీసులకు తెగేసి చెప్పింది. దీంతో ఆమెకు పోలీసులు.. కౌన్సిలింగ్ కేంద్రానికి పంపారు.
అనంతరం పెద్ద కుమార్తె ప్రేమ గురించి మంజునాథ్‌కు తెలిసింది. దీంతో బుధవారం రాత్రి తండ్రీకూతుళ్ల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. కుమార్తెల ప్రేమ వ్యవహారంపై తండ్రి మనస్తాపం చెందినట్లు సమాచారం. వెంటనే కోడికత్తి తీసుకొచ్చి కుమార్తె గొంతు కోసి దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత నిందితుడు మంజునాథ్ విశ్వనాథపుర పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. వెంటనే విశ్వనాథ్పుర్ పోలీసులు.. ఘటనాస్థలిని సందర్శించి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని.. కవచ మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.