12 Hours Train Journey With Husband Dead Body :భర్త చనిపోయాడని తెలియక అతడి మృతదేహంతో 12 గంటలపాటు తన ఇద్దరు పిల్లలతో కలిసి రైలులో ప్రయాణించింది ఓ భార్య. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో జరిగిందీ ఘటన. ఉన్నట్టుండి అనారోగ్యానికి గురైన భర్తకు మందులు ఇచ్చేందుకు నిద్రలేపే సమయంలో అతడు మరణించాడని గుర్తించింది ఆ మహిళ.
అసలేం జరిగిందంటే?
అయోధ్యలోని ఇనాయత్ నగర్‌కు చెందిన 36 ఏళ్ల రామ్‌కుమార్ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మార్బుల్స్(ఇంటి నిర్మాణంలో వాడే రాళ్లు) వేసే పని చేసేవాడు. భార్య ప్రేమ, ఇద్దరు పిల్లలతో కలిసి అక్కడే జీవించేవాడు. ఈ క్రమంలో సోమవారం ఒక్కసారిగా అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో వైద్యం కోసం సొంతూరు అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమైంది రామ్‌కుమార్ కుటుంబం.
ఇందుకోసం అహ్మదాబాద్ నుంచి బెనారస్ వెళ్లే సబర్మతి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 19167)లోని స్లీపర్ కోచ్ నంబర్ S-6, S-43, S-44, S-45 సీట్లను బుక్ చేసుకుంది. మంగళవారం అయోధ్యకు ప్రయాణం ప్రారంభించారు. అలా కొద్ది దూరం వెళ్లాక భర్తకు మందులు ఇచ్చేందుకు భార్య ప్రేమ అతడిని నిద్ర లేపేందుకు ప్రయత్నించింది. ఎంతకీ అతడు మేలుకోకపోవడం వల్ల ఒక్కసారిగా కంగుతింది. కాసేపటికే అతడు మరణించాడని తెలుసుకుంది. రామ్‌కుమార్ మృతదేహంపై పడి బోరున విలపించింది. ఇద్దరు పిల్లలు కూడా తండ్రి మరణంతో దిక్కుతోచని స్థితిలో రైలులోనే కంటతడి పెట్టారు. ఇలా సుమారు 12 గంటలపాటు మృతదేహంతో ప్రయాణించారు.