74 ఏళ్ల తర్వాత దేశంలో చీతాలను ప్రవేశపెట్టిన భారత సర్కారు.. వాటి సంఖ్యను పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలను భారత్‌కు తీసుకొచ్చిన మోదీ ప్రభుత్వం.. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి మరిన్ని చీతాలను రప్పిస్తోంది. ఫిబ్రవరి 18న 12 చీతాలు దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు చేరుకుంటాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. ఈమేరకు ప్రత్యేక వసతులతో కూడిన విమానాన్ని కేంద్రం ఆ దేశానికి పంపించింది. భారత్‌కు తీసుకురానున్న వాటిలో ఏడు మగ, ఐదు ఆడ చీతాలు ఉండనున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్క్‌కు ఈ 12 చిరుతలను అధికారులు తరలించనున్నారు.
1948లో దేశంలో చీతాలు అంతరించిపోయాయి. గతేడాది సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఎనిమిది చీతాలను కునో పార్క్‌లోకి విడిచిపెట్టారు. వాటిలో ఐదు ఆడ, మూడు మగ చీతాలు ఉన్నాయి. దీంతో 74 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చీతాలు దేశంలోకి వచ్చినట్లైంది. ప్రస్తుతం రెండో దశలో భాగంగా 12 చీతాలను రప్పిస్తున్నారు. ఈ చీతాల కోసం కునో పార్క్‌లో ప్రత్యేకంగా 10 ఎన్క్లోజర్లను జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఏర్పాటు చేసింది.