పెళ్లి ప్రక్రియలో ఆహ్వాన పత్రికది ప్రత్యేక స్థానం. తమ స్తోమతకు తగినట్లుగా ఒక్కొక్కరు ఒక్కో రీతిలో రకరకాల డిజైన్లతో వీటిని తయారు చేయిస్తారు. కర్ణాటక శిమోగా జిల్లాకు చెందిన రచయిత హెచ్వీ పంచాక్షరప్ప తన కూతురి పెళ్లికి సంబంధించిన శుభలేఖ విషయంలో మరింత భిన్నంగా ఆలోచించారు. అందుకు తన రచనలనే ఆయుధంగా వాడుకున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 112 పేజీల ఆహ్వాన పత్రికను ముద్రించి.. తన బంధుగణాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు.
ఈ ప్రత్యేక కార్డులో గద్య, పద్యాలు, కవితలు, వివాహ ప్రత్యేకతను తెలిపేలా రచనలు పొందుపరిచారు. అందరి దృష్టిని ఆకర్షించటంతో పాటు వివాహాలపై మంచి అభిప్రాయాలను సృష్టించేందుకే ఈ ప్రత్యేక ఆహ్వాన పత్రికను తయారు చేసినట్లు చెప్పారు పంచాక్షరప్ప.
పంచరంగి పేరుతో..
ఈ పత్రికలో 'పంచరంగి' అనే పేరుతో 676 రచనలను పొందుపరిచారు పంచాక్షరప్ప. వధూవరులు, వివిధ రకాల వివాహాలు, వివాహాల తీరు, సంస్కృతులు, సప్తపది వంటి పలు అంశాలపై ప్రజలకు కీలక సూచనలు చేశారు. వివాహ ఆహ్వాన పత్రికను ప్రత్యేక రంగులతో కూడిన ఆర్ట్ పేపర్తో ఆకర్షనీయంగా తయారు చేశారు.