ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త ఓ బాలిక వద్ద 12 మామిడి పండ్లను 1.2 లక్షలకు కొనుగోలు చేశారు. స్మార్ట్ఫోన్ కొనాలనే ఆ బాలిక కలను సాకారం చేశారు. రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్ముతున్న బాలిక కష్టాలు చూసి చలించి ఈ సాయం అందించారు.
ఝార్ఖండ్ జంషెద్పుర్కు చెందిన ఈ బాలిక పేరు తులసి కుమారి కాగా.. సాయం చేసిన వ్యాపార వేత్త పేరు హమేయా హెటె. వాల్యుబుల్ ఎడ్యుటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆయన పని చేస్తున్నారు.
పేద కుటుంబానికి చెందిన తులసి కుమారి ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. కరోనా కారణంగా విధించిన లాక్డౌన్తో పాఠశాలలు మూతపడి ఆన్లైన్లోనే తరగతులు నిర్వహిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కొనే ఆర్థిక స్తోమత లేక.. రోడ్డు పక్కన మామిడి పండ్లు అమ్మి డబ్బు పోగు చేయాలని తులసి భావించింది. తన ఆర్థిక కష్టాల గురించి స్థానిక మీడియాకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న హమేయా హెటె.. బాలికకు సాయం చేయాలనుకున్నారు. ఒక్కో మామిడి పండును రూ.10వేలకు కొంటున్నట్లు ఆయన చెప్పగానే తులసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది.