ఉత్తరాఖండ్‌లో 11మంది ఐఎఫ్ఎస్ అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దెహ్రాదూన్‌లోని ఎఫ్ఆర్ఐ(ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో శిక్షణ కోసం వచ్చిన వీరు కరోనా బారినపడ్డారు(fri dehradun covid news). ఈ వ్యవహారం రాష్ట్ర ఆరోగ్య విభాగంలో కలకలం రేపింది.
ఈ 11మంది లఖ్‌నవూ నుంచి దిల్లీ మీదుగా దెహ్రాదూన్ వచ్చారు. దిల్లీలో వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. దెహ్రాదూన్ ఎఫ్ఆర్ఐకి చేరుకున్న అనంతరం రిపోర్టులు వచ్చాయి. వారికి కరోనా నిర్ధరణ అయ్యింది.
11మంది నివాసమున్న టిబెటన్ కాలనీ, ఎఫ్ఆర్ఐలోని హాస్టల్‌ను కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించారు అధికారులు. అయితే ఈ 11మందిలో ఓ సీనియర్ అధికారి.. తనకు కొవిడ్ పాజిటివ్ అని తేలిన వెంటనే అక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారు. ఈ విషయాన్ని దెహ్రాదూన్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ రాజేశ్ కుమార్.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
ఎఫ్ఆర్ఐలో కరోనా కేసులు వెలుగుచూడటం ఇది కొత్తేమీ కాదు. 2020 మార్చిలోనే కొందరు అధికారులకు కొవిడ్ సోకింది. దీంతో ఆ ప్రాంతం మొత్తాన్ని మూసివేశారు.