సాధించాలనే తపన ఉండాలేగానీ వయసుతో పనేముంది? నేర్చుకోవాలన్న ఆసక్తి ఉండాలేగానీ ఎప్పుడైతే ఏంటి? కేరళకు చెందిన ఓ బామ్మ(old lady) ఈ ప్రశ్నలకు సమాధానంలా నిలుస్తోంది. 104 ఏళ్ల వయసులో(104 year old woman) రాయడం నేర్చుకుని, అక్షరాస్యత పోటీల్లో 89శాతం మార్కులు సాధించింది.
అయార్కున్నమ్ ప్రాంతానికి చెందిన కుట్టియమ్మకు.. చదవడం వచ్చు. రాయడం తెలియదు. 104 ఏళ్ల వయసులోనూ(104 year old woman) ఆమె రాత కూడా నేర్చుకోవాలనుకుంది. కుట్టియమ్మ ఆసక్తిని గ్రహించిన కున్నుంపురం ప్రాంతానికి చెందిన ప్రేరక్ రహానా.. ఆమెకు రాత నేర్పడంలో సాయం చేశారు. ప్రతిరోజు సాయంత్రం కుట్టియమ్మ ఇంటికి వచ్చి, ఆమెకు రాయడంలో మెలకువలు నేర్పించారు. రహానా సహకారంతో పాఠాలతో కుస్తీ పట్టింది కుట్టియమ్మ. ఆ తర్వాత.. కేరళ ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యత పరీక్షలో పాల్గొంది. మలయాళం, గణితంలో జరిగే ఈ పరీక్షలో 89 శాతం మార్కులు సాధించింది.
రాయడం నేర్చుకునేటప్పుడు కుట్టియమ్మ ఎంతో సంతోషపడేదని ఉపాధ్యాయురాలు రహానా తెలిపారు. కుట్టియమ్మకు కేవలం వినడంలోనే కొద్దిగా సమస్యలు ఉన్నాయని.. అంతకుమించి ఇతర అనారోగ్య సమస్యల్లేవని చెప్పారు. ఈ వయసులోనూ... ఆమె అద్దాలు లేకుండా స్పష్టంగా చూడగలదని పేర్కొన్నారు. కుట్టియమ్మ భర్త టీకే కొంఠి 2002లో కన్నుమూశారు. అప్పటి నుంచి ఆమె తన పిల్లలతో కలిసి ఉంటోంది.