తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జలియన్​వాలా బాగ్​: గుండెల్ని పిండేసిన మారణకాండ!

జలియన్​వాలా బాగ్​ ఊచకోత భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో ఓ మరిచిపోలేని దుర్ఘటన. బ్రిటీష్​ దురహంకారానికి 500 మందికిపైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఈ ఘటన జరిగి ఇప్పటికి 102 ఏళ్లు పూర్తయ్యాయి.

jallianwala bagh massacre, జలియన్​వాలా బాగ్​ మారణకాండ
జలియన్​వాలాబాగ్​ మారణకాండ

By

Published : Apr 13, 2021, 9:32 AM IST

భరతమాత హృదయంపై బ్రిటిష్‌ దురహంకారం చేసిన నెత్తుటి మరక అది! నిరాయుధ ప్రజల నుదుటన ఓ క్రూరుడు రాసిన మృత్యు శాసనమది! వందేళ్లు దాటినా.. గుర్తుకొచ్చిన ప్రతిసారీ భారతీయుల కళ్లను కన్నీటి సంద్రాలుగా మార్చే వ్యథ అది!

మానవాళి చరిత్రలో అత్యంత పాశవిక ఘటనల్లో ఒకటిగా చెప్పుకొనే 'జలియన్‌వాలా బాగ్‌ నరమేధం' చోటుచేసుకొని మంగళవారం నాటికి సరిగ్గా 102 ఏళ్లు.

రౌలత్‌ చట్టంపై నిరసనలతో..

మొదటి ప్రపంచ యుద్ధం (1914-18) ముగిశాక.. బ్రిటన్‌ దాస్య శృంఖలాల నుంచి మాతృభూమికి విముక్తి లభిస్తుందని భారత నాయకులు భావించారు. పరిపాలనా బాధ్యతలను బ్రిటిషర్లు భారతీయుల చేతుల్లో పెడతారని ఆశించారు. అందుకు భిన్నంగా 1919లో కఠినమైన రౌలత్‌ చట్టాన్ని వలస పాలకులు తీసుకొచ్చారు. రాజద్రోహం వంటి కార్యకలాపాలకు పాల్పడేవారిని ఎలాంటి విచారణ లేకుండా జైల్లో వేసేందుకు అది వీలు కల్పిస్తుంది. దానిపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మహాత్మా గాంధీ సైతం ఆ చట్టాన్ని వ్యతిరేకించారు. సత్యాగ్రహం చేపట్టాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం మహాత్ముడు పంజాబ్‌లో అడుగు పెట్టకుండా బ్రిటిష్‌వారు నిషేధం విధించారు. తమ ఆంక్షలను ఉల్లంఘిస్తే ఆయన్ను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. మరోవైపు- రౌలత్‌ చట్టానికి వ్యతిరేకంగా పంజాబ్‌లో శాంతియుత నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన సఫియుద్దీన్‌ కిచ్లూ, సత్యపాల్‌ అనే ఇద్దరు ప్రముఖులను 1919 ఏప్రిల్‌ 9న అధికారులు అరెస్టు చేశారు. వారిద్దరినీ విడుదల చేయాలంటూ స్థానికులు డిప్యూటీ కమిషనర్‌ నివాసానికి మరుసటి రోజు గుంపుగా వెళ్లి డిమాండ్‌ చేశారు. పోలీసులు కాల్పులు జరపడం వల్ల వారిలో పలువురు మృత్యువాతపడ్డారు. కోపోద్రిక్తులైన జనం తిరగబడ్డారు. కనిపించిన ఐరోపావాసినల్లా చితకబాదారు.

ముందస్తు హెచ్చరికల్లేకుండా..

పంజాబ్‌లో రౌలత్‌ చట్టంపై నిరసనలను ఎలాగైనా అణచివేయాలని బ్రిటిష్‌ అధికారులు భావించారు. అందులో భాగంగానే జనం గుంపులుగా చేరడాన్ని నిషేధిస్తూ బ్రిగేడియర్‌-జనరల్‌ డయ్యర్‌ ఉత్తర్వులు జారీ చేశాడు. వాటి గురించి ప్రజలకు పెద్దగా తెలియలేదు. 1919 ఏప్రిల్‌ 13న వైశాఖి పర్వదిన్నాన్ని జరుపుకొనేందుకు జలియన్‌వాలా బాగ్‌లో వేలమంది సమావేశమయ్యారు. అదే సమయంలో ఏప్రిల్‌ 10న జరిగిన కాల్పులను ఖండించడం వల్ల పాటు సఫియుద్దీన్, సత్యపాల్‌లను విడుదల చేయాలని విన్నవించే తీర్మానాలపైనా చర్చించాలని వారు భావించారు. ఆ సమావేశం గురించి తెలియగానే జనరల్‌ డయ్యర్‌ ఊగిపోయాడు. బలగాలతో అక్కడికి చేరుకున్నాడు. ముందస్తు హెచ్చరికలేవీ జారీ చేయకుండా.. నేరుగా కాల్పులు జరపాలని ఆదేశాలిచ్చాడు.

జలియన్‌వాలా బాగ్‌ అంటే..?

బాగ్‌ అంటే తోట! పేరులో జలియన్‌వాలా బాగ్‌ అని ఉన్నా.. తోట ఏమీ లేదక్కడ. 225 x 180 మీటర్ల ప్రైవేటు వ్యక్తుల స్థలమిది. జల్లా గ్రామంలోని 34 మందికి మహారాజా రంజిత్‌సింగ్‌ దాన్ని దానమిచ్చారు! అందుకే మొదట దీన్ని జల్లావాలాగా పిలిచేవారు. కాలక్రమంలో జలియన్‌వాలా బాగ్‌గా మారింది. చుట్టూ ఇళ్లుండి మధ్యలో ఖాళీగా ఉన్న స్థలమది. ఇళ్ల మధ్యలోంచే సన్నటి దారి ఉంటుందీ స్థలంలోకి!

తూటాలు అయిపోయేదాకా కాల్పుల మోత

జలియన్‌వాలా బాగ్‌ నుంచి బయటకు వెళ్లే ద్వారాన్ని మూసివేసి డయ్యర్‌ కాల్పులకు ఆదేశించాడు. తర్వాత 10-15 నిమిషాలపాటు ఏకధాటిగా కాల్పులు కొనసాగాయి. వందల మంది శరీరాలను తూటాలు ఛిద్రం చేశాయి. హాహాకారాలు మిన్నంటినా.. పిల్లలు, మహిళలు అన్న తేడా లేకుండా అందరూ పిట్టల్లా రాలి పడిపోతున్నా.. మందుగుండు సామగ్రి ఖాళీ అయ్యేంతవరకు కాల్పుల మోత ఆగలేదు. మొత్తం 1,650 రౌండ్ల కాల్పులు చోటుచేసుకున్నాయి. శవాలు కుప్పలుగా పేరుకుపోయాయి. గాయపడ్డవారి ఆర్తనాదాలు గగన వీధులను తాకాయి. అవేవీ పట్టించుకోకుండా, కాల్పులు ముగియగానే బలగాలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వైద్యబృందాలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాల్పులను తప్పించుకునేందుకు చాలామంది పక్కనే ఉన్న బావిలోకి దూకి.. అందులో ప్రాణాలు కోల్పోయారు.

ఇప్పటికీ లెక్కతేలని మరణాలు

ఇంతకు జలియన్‌వాలా బాగ్‌ కాల్పుల్లో ఎంతమంది మరణించారు? ఆ లెక్క ఇప్పటికీ సరిగా తేలలేదు. 500 మందికిపైగా అమాయకుల ప్రాణాలు ఆ మారణహోమంతో గాల్లో కలిశాయని మదన్‌మోహన్‌ మాలవీయ ఓ నివేదికలో పేర్కొన్నారు. 547 మంది మృత్యుఒడికి చేరినట్లు కొన్ని రికార్డుల్లో ఉంది. అందులో 502 మందిని గుర్తించారని, మరో 45 మంది ఎవరో తెలియలేదని చెబుతుంటారు. మృతుల్లో ఏడు నెలల పసిపాప నుంచి 80 ఏళ్ల ముదుసలి దాకా ఉన్నారు. బ్రిటిష్‌ లెక్కలు మాత్రం మృతుల సంఖ్యను 379గా సూచిస్తున్నాయి. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం దాదాపు 20 వేలమంది ఆ రోజు జలియన్‌వాలా బాగ్‌లో జమయ్యారు. గాయపడి, తర్వాత మరణించినవారు లెక్కలోకి రాకుండా పోయారు. కాల్పుల తర్వాత డయ్యర్‌ యంత్రాంగం పంజాబ్‌ అంతటా మార్షల్‌ లా విధించింది. మూడునెలల పాటు రాష్ట్రమంతా కఠిన ఆంక్షలు! వాటిని ఉల్లంఘించిన 18 మందిని ఉరితీశారు.

క్రూరుడిపై ప్రశంసలు

నిర్దాక్షిణ్యంగా వందలమంది మరణానికి కారణమైన జనరల్‌ డయ్యర్‌పై బ్రిటిష్‌ ప్రభుత్వంలోని చాలామంది ప్రశంసలు కురిపించటం గమనార్హం. ముఖ్యంగా బ్రిటన్‌ పార్లమెంటులోని హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌ సభ్యులు ఆ క్రూరుడి చర్యల్ని సమర్థించారు. 'పంజాబ్‌ రక్షకుడు' అనే బిరుదును కూడా అందజేశారు. ప్రతినిధుల సభలో మాత్రం డయ్యర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి.. డయ్యర్‌పై ఎలాంటి ఛార్జిషీటు దాఖలు కాలేదు. ఉద్యోగం నుంచి తొలగించి.. భారత్‌లో మళ్లీ పనిచేయకుండా లండన్‌కు పంపించారంతే. తర్వాత అతడికి 'సర్‌' బిరుదు దక్కింది. 1920లో హంటర్‌ కమిషన్‌ నివేదిక డయ్యర్‌ను, అప్పటి పంజాబ్‌ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.

మరింత మందిని చంపేవాణ్ని

జనరల్​ డయ్యర్​

"గుమిగూడిన వారంతా కనిపించకుండా పోయేలా కాల్పులు జరుపుతూనే ఉన్నా! ఒకవేళ మరింతమంది సైనికులు నా చేతిలో ఉండుంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ప్రాణాలు తీసేవాణ్ని! నా ఉద్దేశం అక్కడ గుమిగూడినవారిని చెల్లాచెదురు చేయడం ఒక్కటే కాదు.. అక్కడికి వచ్చినవారికి, రానివారికి.. ముఖ్యంగా పంజాబ్‌లోని అందరికీ చెప్పిన మాట వినకుంటే ఏమౌతుందో ఓ గుణపాఠం నేర్పాలనుకున్నా!"

- జనరల్‌ డయ్యర్‌ (1919 ఆగస్టు 25న తన నివేదికలో)

20 ఏళ్ల తర్వాత డయ్యర్‌ హతం

జనరల్‌ డయ్యర్‌ భారత్‌ నుంచి వెళ్లిపోయినా అతణ్ని మృత్యువు వెంటాడింది. 20 ఏళ్ల తర్వాత ఉద్దమ్‌సింగ్‌ అనే దేశభక్తుడు లండన్‌ వెళ్లి మరీ 1940 మార్చి 13న డయ్యర్‌ను హతమార్చాడు. లండన్‌లోని కాక్స్‌టన్‌ హాల్‌లో ఈస్ట్‌ ఇండియన్‌ అసోసియేషన్‌ సమావేశం జరిగింది. దానికి సూటూబూటు వేసుకొని హాజరైన గదర్‌ పార్టీ విప్లవ వీరుడు ఉద్దమ్‌సింగ్‌ తుపాకీతో డయ్యర్‌ను కాల్చి చంపాడు. అక్కడికక్కడే అతణ్ని అరెస్టు చేశారు. ఓల్డ్‌ బైలీ కోర్టులో జూన్‌ 4-5 తేదీల్లో రెండురోజుల పాటు విచారణ జరిపి ఆయనకు మరణశిక్ష విధించారు. శిక్ష ప్రకటించే ముందు ఏమైనా చెప్పుకొంటారా అని ఉద్దమ్‌ను న్యాయమూర్తి అడగ్గా.. "బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం నశించాలి. మీ చరిత్రంతా రక్తసిక్తం. ఒక్కసారి మీరు చేసిన మారణహోమాలు, మీ చేతికంటిన రక్తపు మరకలు చూసుకోండి. చావంటే నాకు భయం లేదు. నా దేశం కోసం గర్వంగా మరణిస్తా. మిమ్మల్ని తరిమి కొట్టేందుకు నాలాంటి వారెంతోమంది నా దేశంలో పుట్టుకొస్తారు" అంటుండగానే.. ఈ రాజకీయ ప్రసంగాలు వినను అంటూ.. న్యాయమూర్తి అట్కిన్సన్‌- మరణశిక్ష ప్రకటించారు. 1940 జులై 31న లండన్‌లోని పెంటోన్‌విలె జైలులో 37 ఏళ్ల ఉద్ధమ్‌ను ఉరితీశారు.

ఉద్దమ్​సింగ్​

ముమ్మరంగా స్వాతంత్య్ర పోరాటం

జలియన్‌వాలా బాగ్‌ ఉదంతం భారత స్వాతంత్య్రోద్యమ రూపురేఖల్ని మార్చిందని చెప్పుకోవచ్చు. ఆ నరమేధంపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ తనకు బ్రిటిష్‌ ప్రభుత్వం ఇచ్చిన నైట్‌హుడ్‌ అవార్డును పరిత్యజించారు. మహత్మాగాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని తీవ్రతరం చేశారు. జలియన్‌వాలా బాగ్‌ మారణహోమం తర్వాత నుంచి ప్రజా సమూహాలపై బ్రిటిష్‌ సైనికులు కాల్పులు జరపడాన్ని నిషేధించారు.

ఇదీ చదవండి :రఫేల్ రగడపై సుప్రీంలో విచారణ

ABOUT THE AUTHOR

...view details